మాతృత్వం అనే మధుర భావనను ఆసరాగా చేసుకుని సంతాన సాఫల్య (ఐవీఎఫ్) కేంద్రాలు సాగిస్తున్న అక్రమ అండాల సేకరణ దందాపై తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసిన ఆగ్రహం అత్యంత సమంజసమైనది. ఎక్కువ అండాల కోసం పేద మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడాన్ని—”ఎక్కువ పాల కోసం పశువులకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో”—పోల్చుతూ న్యాయస్థానం వేసిన ప్రశ్న వైద్య వృత్తి నైతికతను నిలదీస్తుంది. అంతేకాదు, ఈ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య సంస్థలు, డాక్టర్లపై చర్యల విషయంలో పోలీసులు చూపుతున్న అసమానతను (సెలెక్టివ్ యాక్షన్) హైకోర్టు తప్పుబట్టడం దర్యాప్తు పారదర్శకతపై పలు సందేహాలను లేవనెత్తుతుంది.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల వెలుగుచూసిన అంతర్రాష్ట్ర అండాల అక్రమ రవాణా రాకెట్ సంతాన సాఫల్య వైద్య రంగంలోని చీకటి కోణాన్ని బట్టబయలు చేసింది. ఆర్థిక అవసరాల్లో ఉన్న పేద మహిళలను దలారుల ద్వారా రప్పించి, రహస్య స్థావరాల్లో నిర్బంధించి, వారి శరీరాలకు మోతాదుకు మించిన హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరించడం అత్యంత ఆందోళనకరం. ‘సంతాన సాఫల్య వైద్యం పేరుతో సాగుతున్న ఈ మహిళల దోపిడీకి అడ్డుకట్ట ఎక్కడ?’ అనే ప్రశ్న నేడు సమాజం ముందు నిలిచింది. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ‘సమ్మతి’ (ఇన్ఫార్మ్ డ్ కన్సెంట్). కేవలం అండదాతల వద్ద తీసుకునే సంతకాలతో కూడిన సమ్మతి పత్రాలు మాత్రమే చట్టబద్ధతకు, నైతికతకు సరిపోతాయా? పేదరికం, నిరక్షరాస్యత నేపథ్యం ఉన్న మహిళలకు పదేపదే అండాల సేకరణ వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలపై కనీస అవగాహన ఉండదు. అండాశయ క్యాన్సర్, తీవ్రమైన హార్మోన్ల అసమతుల్యత వంటి ముప్పుల గురించి వారికి వివరిస్తున్నారా? నిబంధనల ప్రకారం అండదాతలకు ఆయా క్లినిక్‌లతో సంబంధం లేని ‘స్వతంత్ర వైద్య నిపుణుల సలహా’ (ఇండిపెండెంట్ మెడికల్ కౌన్సెలింగ్) అందుతున్నదా అంటే శూన్యమనే సమాధానం వినిపిస్తుంది . లాభాపేక్షే పరమావధిగా పనిచేసే కేంద్రాలు దాతల ఆరోగ్యాన్ని గాలికి వొదిలేసి, కేవలం కాగితాలపై సంతకాలతో చేతులు దులుపుకుంటున్నాయి.
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (నియంత్రణ) చట్టం – 2021 (ఏఆర్టీ యాక్ట్– 2021) ప్రకారం, ఒక మహిళ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అండాలను దానం చేయడానికి అర్హురాలు. ఆ ఒక్కసారిలో గరిష్టంగా ఏడు (7) అండాలను మాత్రమే సేకరించాలి. దేశంలోని అన్ని రిజిస్టర్డ్ ఐవీఎఫ్ కేంద్రాలు ఒకే కేంద్ర డేటాబేస్కు అనుసంధానమై ఉండాలి. ఏ కేంద్రంలో అండం సేకరించినా ఆ వివరాలు వెంటనే ఈ జాతీయ పోర్టల్‌లో నమోదు చేయాలి. అండదాత గుర్తింపును ధ్రువీకరించడానికి ఆధార్ సంఖ్య లేదా బయోమెట్రిక్ వివరాలను రిజిస్ట్రీలో నమోదు చేయడం తప్పనిసరి. దీనివల్ల ఒకే మహిళ వేర్వేరు పేర్లతో లేదా వేర్వేరు క్లినిక్‌లకు వెళ్లి మళ్లీ దానం చేయడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ వెంటనే గుర్తించి హెచ్చరిస్తుంది.
ప్రతి క్లినిక్ తాము సేకరించిన అండాల సంఖ్యను, వాటిని ఏ జంటకు ఉపయోగించారనే వివరాలను డిజిటల్ రికార్డులలో కనీసం పదేళ్ల పాటు భద్రపరచాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు ఈ రికార్డులను, ల్యాబ్ లాగ్‌బుక్‌లను తనిఖీ చేసి పరిమితికి మించి సేకరించారా లేదా అని తెలుసుకుంటారు. అండాల ఉత్పత్తిని పెంచే ఖరీదైన హార్మోన్ ఇంజెక్షన్ల విక్రయాలను ఫార్మసీల స్థాయిలో ట్రాక్ చేయడం ద్వారా కూడా ఏ క్లినిక్‌లో ఎంతమందికి చికిత్స జరుగుతోందో అంచనా వేయవొచ్చు. చాలా కేంద్రాలు జాతీయ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేయకుండా, దలారుల ద్వారా నకిలీ ఐడీలతో మహిళలను తీసుకువొచ్చి రహస్యంగా అండాలు సేకరిస్తుండటంతో వ్యవస్థ కళ్లుగప్పగలుగుతున్నాయి. ఏఆర్టీ యాక్ట్–2021 అమల్లో ఉన్నప్పటికీ ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన రాష్ట్ర వైద్య నియంత్రణ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది . ఒకే మహిళ నుండి పరిమితికి మించి ఎన్నిసార్లు అండాలు సేకరిస్తున్నారో గుర్తించే వ్యవస్థ లేకపోవడం దలారులకు వరంగా మారింది.
హైకోర్టు జోక్యం చేసుకుని నిల్వ ఉన్న వేలాది అండాల రక్షణకు, బాధిత రోగుల చికిత్సకు ఆదేశాలు ఇవ్వాల్సి రావడం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది . అక్రమ దందా వెలుగుచూసిన వెంటనే ఆయా ఐవీఎఫ్ కేంద్రాలను సీజ్ చేయడంతోనే అధికారులు తమ బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకున్నారు. కానీ, ఆ కేంద్రాల్లోని క్రయో-ప్రిజర్వేషన్ యూనిట్లలో నిల్వ ఉన్న వేలాది అండాలు, పిండాల భద్రత గురించి కనీస ముందుచూపు లేకపోవడం తీవ్ర పరిపాలనా వైఫల్యం. నిరంతర విద్యుత్, ద్రవ నత్రజని సరఫరా నిలిచిపోతే, ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు, చికిత్స మధ్యలో ఉన్న బాధిత రోగులకు ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు కల్పించడంలోనూ వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. దర్యాప్తు పేరిట క్లినిక్‌లను మూసివేయడం వల్ల నేరస్తుల కంటే ఎక్కువగా అమాయక దంపతులే మానసిక, ఆర్థిక క్షోభకు గురయ్యారు.
వైద్యం వ్యాపారంగా మారినప్పుడు మానవత్వం మంటగలుస్తుంది. ప్రభుత్వం తక్షణమే మేల్కొని రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్, ఏఆర్టీ కేంద్రాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలి. అండదాతలకు స్వతంత్ర వైద్య కౌన్సెలింగ్‌ను తప్పనిసరి చేయడంతో పాటు, జాతీయ రిజిస్ట్రీని కట్టుదిట్టంగా అమలు చేయాలి. రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధ్యులైన ప్రతి ఒక్కరిపై నిష్పక్షపాత చర్యలు తీసుకున్నప్పుడే మహిళల ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది, వైద్య వృత్తికి గౌరవం దక్కుతుంది.





