ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్

– ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ
– స్థానికంగానే విమాన విడిభాగాల తయారీ, నిర్వహణకు అవసరమైన టూలింగ్
–  ‘టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17: ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విడిభాగాల తయారీతోపాటు వాటికి అవసరమైన టూలింగ్‌, అధునాతన యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోనే అందుబాటులోకి తెచ్చేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. విమానాలు, విమాన ఇంజిన్ల అసెంబ్లీ, మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన ప్రత్యేక టూల్స్‌, ఫిక్చర్లు, గేజ్‌ల తయారీ కోసం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జేఈహెచ్ ఏరోస్పేస్ ఏర్పాటు చేసిన టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘తెలంగాణ రైజింగ్‌–2047’ విజన్ లో భాగంగా రాష్ట్రాన్ని అడ్వాన్స్ డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఏరోస్పేస్‌, రక్షణ, సాంకేతిక రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులకు, పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. విడిభాగాల తయారీతోపాటు డిజైన్‌, ఇంజినీరింగ్‌, ప్రెసిషన్ మాన్యుఫాక్చ‌రింగ్‌, టెస్టింగ్ తదితర విభాగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామ‌ని, ప్రపంచస్థాయి సంస్థలు, దేశీయ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో స్థానిక ఎంఎస్‌ఎంఈలను అనుసంధానించడంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. విమానాలకు అవసరమైన ప్రత్యేక పరికరాలు, ఫిక్చర్లు, గేజ్‌ల కోసం ఇప్పటివరకు కొద్దిమంది ప్రత్యేక సరఫరాదారులపై లేదా విదేశాలపై కంపెనీలు ఆధారపడాల్సి వచ్చేదని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇలాంటి అధునాతన టూలింగ్ సామర్థ్యాలు హైదరాబాద్ లో అందుబాటులోకి రావడం రాష్ట్ర పారిశ్రామికరంగ వృద్ధికి మరింత ఊతమిస్తుందన్నారు. ఏరోస్పేస్ గ్లోబల్ సప్లై చైన్ లో ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేందుకు ఇలాంటి కేంద్రాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌, జేఈహెచ్ ఏరోస్పేస్ సీఈవో విశాల్ సంఘావి, సీవోవో వెంకటేష్ ముద్రగళ్ల తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *