– వాయు కాలుష్యం, దుమ్ము, పొగతో సీఓపీడీ వచ్చే ప్రమాదం
– చలికాలంలో మరింత తీవ్రమయ్యే శ్వాసకోశ సమస్యలు
– దగ్గు, ఆయాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
– ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: పొగతాగే అలవాటు లేనివారికీ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ) వచ్చే ప్రమాదం ఉందని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు హెచ్చరించారు. వాహనాల పొగ, నిర్మాణ పనుల వల్ల వచ్చే దుమ్ము, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, వంట పొగను ఎక్కువకాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా చలికాలంలో చల్లని గాలి, వాయు కాలుష్యం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. నవంబర్ 18న ప్రపంచ సీఓపీడీ దినోత్సవం సందర్భంగా వ్యాధి లక్షణాలు, ముందస్తు గుర్తింపు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.సీఓపీడీ అనేది ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లి రావడానికి ఆటంకం ఏర్పడే దీర్ఘకాలిక వ్యాధి. సాధారణంగా పొగతాగేవారికే ఈ సమస్య వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే పొగతాగే అలవాటు లేనివారిలోనూ ఈ వ్యాధి కనిపించవచ్చని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ, నిర్మాణ కార్యకలాపాలు, వాయు కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.సీఓపీడీని ప్రారంభ దశలో గుర్తించకపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. ఎక్కువ రోజులుగా దగ్గు ఉన్నా సాధారణ జలుబుగా భావించడం, నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తే వయసు పెరగడం వల్లేనని నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. దీంతో రోజువారీ పనులు చేసుకోవడం కష్టమయ్యే వరకు వ్యాధిని గుర్తించలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవి తేజ బుద్ధ మాట్లాడుతూ ‘సీఓపీడీ అంటే పొగతాగేవారికి మాత్రమే వచ్చే వ్యాధి కాదు. ఆ అలవాటు లేకపోయినా ఏళ్లతరబడి దుమ్ము, కాలుష్యం, వంట పొగకు గురైనవారిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. చాలామంది దగ్గు, పిల్లికూతలు, ఆయాసం వంటి ప్రారంభ లక్షణాలను చిన్న సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కొద్దిదూరం నడిచినా, మెట్లు ఎక్కినా ఊపిరి అందకపోతే సాధారణ సమస్యగా తీసుకోకూడదు. స్పైరోమెట్రీ అనే శ్వాస పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకుని సీఓపీడీని గుర్తించవచ్చు’ అని వివరించారు. చలికాలంలో సీఓపీడీతోపాటు ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. చల్లని, పొడి గాలి శ్వాసనాళాల్లో ఇబ్బందులను పెంచుతుందని తెలిపారు. దీనికి వాయు కాలుష్యం, జలుబు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తోడైతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. సీఓపీడీ బాధితుల్లో ఒక్కసారిగా ఆయాసం పెరగడం, దగ్గు ఎక్కువ కావడం, కఫం అధికంగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చని చెప్పారు. కొన్నిసార్లు పరిస్థితి విషమించి అత్యవసర చికిత్స అవసరమవుతుందని తెలిపారు. చలికాలంలో సీఓపీడీ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగడం తగ్గించాలి. చల్లని గాలిలో బయటకు వెళ్లేటప్పుడు ముక్కు, నోటిని కప్పుకోవాలి. వైద్యులు సూచించిన ఇన్హేలర్లను క్రమం తప్పకుండా వాడాలి. ఆరోగ్యం మెరుగుపడిందని మందులను సొంతంగా ఆపకూడదు. ఒక్కసారిగా ఆయాసం పెరిగినా, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని డాక్టర్ రవి తేజ సూచించారు. 40 ఏళ్లు దాటినవారిలో దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా పొగతాగే అలవాటు ఉన్నవారు, ఎక్కువకాలం దుమ్ము, కాలుష్యానికి గురైనవారు ఊపిరితిత్తుల పనితీరును పరీక్షించుకోవాలన్నారు. సీఓపీడీని పూర్తిగా నయం చేయలేకపోయినా ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చని, వ్యాధి తీవ్రత పెరగకుండా జాగ్రత్తపడవచ్చని వివరించారు. ప్రపంచ సీఓపీడీ దినోత్సవం సందర్భంగా పొగతాగే అలవాటు లేనివారు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ప్రారంభ లక్షణాలను గుర్తించి సకాలంలో వైద్యులను సంప్రదించాలని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




