– ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
– సానుకూలంగా స్పందించిన సీఎం విష్ణుదేవ్
రాయ్‌పూర్, ప్రజాతంత్ర, నవంబర్ 17: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కోరారు. ఆయనతో రాయ్‌పూర్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించి ఎన్‌వోసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును తొలుత కంతనపల్లి వద్ద ప్రతిపాదించారు. ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం పూర్తిస్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతుంది. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదు. అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తిస్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌వోసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





