– ఆపై బిల్డింగ్ పైనుండి తోసేసిన వైనం
– పార్టీలు, ప్రజా సంఘాల మండిపాటు
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 9 : ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 6న లైంగిక దాడి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వేసవి సెలవుల నేపథ్యంలో ఖమ్మం నగరం సమీపంలోని ఓ మండలానికి చెందిన బాలిక తన తల్లితో కలిసి స్థానిక 58వ డివిజన్ లోని అపార్ట్ మెంట్ లో పని చేస్తున్న తాత ఇంటికి వచ్చింది. ఓ ఫ్లాట్ యజమాని అయిన డ్రైవర్ గౌస్(56) బాలికపై కన్నేశాడు. అపుడప్పుడు తిను బండారాలు ఇచ్చి మాయ మాటలు చెప్పి దగ్గరికి తీసుకునేవాడు. అతని వెకిలి చేష్టలతో బాలిక భయపడి అతను ఉన్నప్పుడు అటు వైపు వెళ్ళేది కాదు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ సాయంత్రం బాలిక రెండవ అంతస్తు నుంచి ఆడుకుంటూ మూడవ అంతస్తుకు వెళ్ళింది. వెనుక నుంచి ఆమెను ఫాలో చేస్తున్న గౌస్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో భవనం పైనుంచి పక్కనున్న స్థలంలో కింద పడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రమాదవశాత్తు పడి ఉంటుందని భావన కల్పించేలా అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పడి ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రమాదవశాత్తు కిందపడి ఉంటుందని భావించిన వారు హుటాహుటిన మమత ఆసుపత్రి తరలించారు. బాలికకు వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం పూర్తి స్థాయిలో స్పృహలకు వచ్చిన బాలిక గౌస్ అంకుల్ విషయాన్ని చెప్పింది. దీంతో జరిగిన సంఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సదరు నిందితుడిపై గతంలోనూ కిడ్నా ప్, గొడవల కేసులు ఉన్నాయి. పదేళ్ల అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక డివిజన్లో నేటికీ పోలింగ్ బూత్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మైనర్ బాలిక కావడంతో పోక్సోతో పాటు హత్య ప్రయత్నo సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ తరలిస్తామని బంధువులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

