హేతుబద్దం కాని హేతుకీకరణ

 “27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి  బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి ఉంది. ప్రభుత్వ విద్యా వినాశానానికే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం.”తల్లినుండి పిల్లను వేరుచేయడం ఎంత అనైతికమో “ఊరి నుండి బడిని దూరం చేయడం కూడా అంతే అనైతికం..”  
-మైసా శ్రీనివాస్ రాష్ట్ర
పూర్వ, ప్రధాన                         కార్యదర్శి
TPTF.      తెలంగాణ..

23000 ప్రభుత్వ బడుల మూసివేత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించనున్నామని రవాణా సౌకర్యం లేని కాలంలో తండాల్లో, గ్రామాల్లో బడులు ఏర్పాటు ఔట్ డేటెడ్ పద్ధతి.విద్యార్థుల ఇంటికి స్కూల్ బస్సు సౌకర్యం. ఉచితంగా పికప్, డ్రాప్ సౌకర్యం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. “మూతబడిన ఆరు వేల ప్రభుత్వ బడులను.తెరవాలి !,ఏకోపాధ్యా య బడులను,జీరో నమోదు బడులను మూత పడనీయవద్దు, ఇది ప్రభుత్వ నిర్ణయం ! అని రెండేళ్ళ క్రితం ప్రకటించింది కూడా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డియే. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలెక్కువున్నాయనీ, వారు బయట రాజకీయాలలో పాల్గొంటున్నారనీ మరొక సారి వాఖ్యానిం చారు. పొంతన లేని వాఖ్యలు, శాస్త్రీయత కు దూరమైన ఆలోచన లు ,భవిష్యత్ నిర్వహణ పై అంఛనా లేని ఆచరణలతో రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఏం చేయనున్నారో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఈ మేరకు ప్రభుత్వవిద్య నిర్వహణ పట్ల రేవంత్ కు సరైన విజన్ లేదని భ్రమపడ్డామే కానీ ఆయనకున్న విజనల్లా పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేయటమే అనేది ఇప్పుడు స్పష్టమైంది.

    రెండు సంవత్సరాల కాలంలో భిన్న మైన ప్రకటనల సారం మనకు తెలియపరచేది ప్రభుత్వ విద్యను చివరికి మాయం చేసే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. మొదట నుండి ప్రభుత్వ విద్య పట్ల తనకున్న ఆలోచనను ఆచరణలో పెట్టే దిశగా భిన్న ప్రకటనలు చేస్తుండటం విద్యారంగ మేధావులు గమనిస్తూనే ఉన్నారు. ఇరవై ఏడు వేల పాఠశాలలను నాలుగు వేల పాఠశాలలుగా కుదించటమంటే ఇరవై మూడు వేల పాఠశాలలను మూసేసేందుకు సిద్దపడినట్టే కదా! వేలాది బడులను మూతవేసే రేవంత్ సర్కార్ కు పేదల విద్య పై ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుంది..విద్యారంగ మేధావులు కానీ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు కానీ లేకుండా ఎకాఎకీగా ఈ ప్రకటన చేయటం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయనేది తెలియాల్సివుంది.  విద్యారంగంతో సంబంధం లేని ఎన్.జి.ఓ. ల అభిప్రాయాలను అనుసరించి హేతుబద్దం కాని హేతూకీకరణ తో తండాలు,పంచా యితీల పరిధిలో వేలాది పాఠశాలలిప్పుడు మాయం కానున్నాయి. తండాలలో పంచాయతీ లలో పాఠశాలల నిర్వహణ ఔట్ డేటెడ్ విధానమంటూ ఇరవై మూడు వేల బడులు మూసేయటం సరైందనీ రేవంత్ రెడ్డి స్థిర నిశ్చయంతో ఉన్నారు.ఈ మూసివేతల వలన పాఠశాల విద్య బాగుపడుతుందని ఏ విద్యావేత్త సూచించారో కానీ దానిని రేవంత్ రెడ్డి విశ్వసించి,ఆచరించటం ప్రభుత్వ విద్యకు సమాధి కట్టడమే అవుతుంది..
    ప్రభుత్వ విద్య పై అసలు ఏ రాజకీ య పక్షానికీ కూడా ఓ విజన్ అంటూ లేకపోవటమే విచారదాయకం. తండాలను పంచాయతీలుగా అభివృద్ధి చేసి అక్కడ గ్రామ సెక్రటేరియట్లను నెలకొల్పిన ప్రభుత్వం అక్కడ చదువు పంచే బడులు లేకుండా చేస్తుండటం గమనీయం. విద్యార్థుల ఇంటికి స్కూల్ బస్సు పంపిస్తాం. ఉచితంగా పికప్, డ్రాప్ సౌకర్యం కల్పిస్తాం, చదువులో వెనకబడిన విద్యార్థులకు సాయంత్రం బడిలోనే ట్యూషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పటం ‘కూట్ల రాయేరనోడు, యేట్ల రాయి యేరుతాననటం’ లాంటిదే. ప్రస్తుతం ప్రభుత్వం ఆచరణ తీరు. మునుపెన్నడూ లేని ఆరు డి.ఏ. ల పెండిం గ్. ఇంకా పూర్తికాని పి.ఆర్.సి. కమిషన్ అమలు,పదవీ విరమణ బకాయిల చెల్లింపు ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ అప్పులూ‌,ఆర్ధిక సమస్యలలో పిల్లలకు రవాణా సౌకర్యం ఏర్పా టు సాధ్యమయ్యే పనేనా! 27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి  బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి ఉంది. ప్రభుత్వ విద్యా వినాశానానికే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం.”తల్లినుండి పిల్లను వేరుచేయడం ఎంత అనైతికమో “ఊరి నుండి బడిని దూరం చేయడం కూడా అంతే అనైతికం.
‘ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టినట్టుగా’ జీరో నమోదు పాఠశాలలు. ఏకోపాధ్యాయ పాఠశాలలు ను బతికించుకునేందుకు మార్గాలు వెదకాల్సిన సర్కార్ వాటిని మూసివేసేందుకు సిద్దపడటం హేతుబద్దం కాదు.గత ప్రభుత్వం దారిలోనే నడుస్తూ పాఠశాల విద్య ను నిర్వీర్యం చేస్తూ,ఇప్పుడు ఏకంగా 23000 ప్రభుత్వ బడులను మూత వేసే ఆలోచనల రేవంత్ చెపుతున్న కారణాలు హాస్యాస్పదం. మహబూబాద్ జిల్లాలో జిల్లా విద్యాధికారి మూతబడిన 162 పాఠ శాలలను తిరిగి తెరిపించేందుకు ముందడుగేసి.ప్రజల ప్రశంసలు ఆందుకుంటున్నారు.
ఈ ప్రయోగం రాష్ట్ర మంతటా కొనసాగాలి ఒక్క వోటర్ కోసం అయినా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే మన అధికార సూత్రాలు చదువుకునే పిల్లల పట్ల ఇదే ఆచరణ ప్రదర్శించక పోవటం గమనార్హం. ప్రతి కిలో మీటర్ కు ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానంగా ప్రభుత్వ విద్యలో నమోదు శాతం పెంచేందుకు దోహద పడుతుంది. ఆ నమోదు ఉన్నత పాఠశాలల బలోపేతానికి దోహదపడుతుంది.తండాలలో గిరిజన గూడెం లలో మారుమూల పల్లెల్లో బడులు మూత వేస్తే ప్రభుత్వ పాఠశాలలో నమోదు శాతం దిగజారుతుంది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ప్రయివేట్ విద్యావ్యాపారానికి ఊతమిస్తుంది.
   రాష్ట్రంలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చాలాకాలంగా నిలిచి పో యింది.స్కావెంజర్లతో పనులు గట్టెక్కుతున్నాయి. మండల పట్టణ పరిధులలో పరిశీలనాధికారులైన ఎం.ఇ.ఓ.,పోస్టుల భర్తీ జరగడం లేదు. అదనపు తరగతి గదుల, వాష్ రూమ్ ల నిర్మాణం లేదు.నిధుల మంజూరీ లేక చేసిన సివిల్ పనులకు ఎం.బి. చేయకుండా, నిధులు ఇవ్వక గుత్తేదారులకు కోట్ల రూపాయల బాకీలు పెండింగ్ లో ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైతున్న తరుణంలో బడుల కనీస మౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవాల్సిన సమయం ఇది. ఊరిబడిలో అన్ని సౌకర్యాలు లభిస్తే ప్రయివేట్ బడులలో నమోదు పెరిగే అవకాశం ఉండకపోవచ్చు కదా! ప్రభుత్వమే ప్రభుత్వ బడుల పై కక్ష కడితే అవి మనుగడ కొనసాగించటం ప్రశ్నార్ధకమే! తల్లిదండ్రులు కానీ , ఊరి పెద్దలను కానీ , విద్యావేత్తలను కానీ , ఉపాధ్యాయ సంఘాలను కానీ సంప్రదించకుండా ఎవరో ఎన్.జి.ఓ. ఇచ్చిన సలహాలు పాటించి 23000 బడులను మూసివేసేందుకు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ప్రభుత్వం చేయబోతున్న తప్పుడు ఆచరణనే అవుతుంది. ఊరికి ఊరిబడి లేకుండా చేయటం పేదలకు దళితులకు గిరిజనులకు విద్య దూరం చేయటమే అవుతుంది. గ్రామాలలో విద్యా వాతావరణం కనిపించకుండా పోతుంది. ప్రధానం గా బాలికా విద్య కు ఈ నిర్ణయం శాపంగా పరిణమిస్తుంది. పుట్ట గొడుగుల్లా ప్రయివేట్ పాఠశాలల పెరుగుదలకు ఈ నిర్ణయం దారులు వేస్తుంది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసమే ఈ కుదింపు నిర్ణయం
ప్రస్తుత పాఠశాలల తక్షణ సమస్యల పరిష్కారం విడిచి వందల కోట్ల రూపాయల వ్యయంతో కొత్త పథకాల ప్రతిపాదనలు ఎవరి ప్రయోజనాల కోసమనే ప్రశ్నార్ధకం.గత ప్రభుత్వం కులాల పేరిట ,మతాల పేరిట ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల వల్లనే ప్రభుత్వ. గ్రామీణ పాఠశాలలు కుదేలయ్యాయి.ఎవరూ అడగని ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం తన ఆచరణను కొనసాగిస్తూంది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాలు ఏమిటో ఇప్పటికీ స్పష్టత లేదు.విద్యావిధానం లో ఏవైనా మార్పులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, విద్యారంగ పరిరక్షణ కోసం పనిచేస్తున్న విద్యావేత్తలను సంప్రదించటం సహేతుకమైనది కదా…నాలుగవ తరగతి నుండి ఉన్నత తరగతుల విద్య కోసం 117 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. అన్ని రకాల రెసిడెన్సియల్ పాఠశాలలను కేంద్రీకృతం చేస్తూ నిర్వహించబోయే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరబోయే విద్యార్థులు ప్రస్తుత ప్రభుత్వ గ్రామీణ.పాఠశా లల నుండే చేరక తప్పదు.
    ప్రభుత్వ విద్యా నిర్వహణలో లోని ప్రభుత్వ,మండల,జిల్లా పరిషత్ బడుల్లో నమోదు మరింతగా తగ్గుముఖం పట్టి అంతరించి పోయే ప్రమాదం లేకపోలేదు.కొడంగల్, మధిర లో ఇప్పటికే ఏర్పాటు ప్రక్రియ మొదలైన ఆ రెండింటితో కలిపి మొ త్తం 117 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలో ఏర్పాటు కా నున్నాయి.ఒక్కోదానికి దాదాపు 22 కోట్లరూపాయల వ్యయం అంఛనా వేశారు.ఇందుకోసం వ్యయం చేసే కోట్లాది రూపాయల నిధులతో ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా  బలోపేతం చేయడం పై ప్రభుత్వం పునరాలోచించాలి. గత ప్రభుత్వం అవగాహన రాహిత్య నిర్ణయాలతో పతనావస్థలోకి చేరాయి.అంగన్ వాడిలో ప్రాక్ ప్రాథమిక తరగతుల నిర్వహణ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది . గత పాలకుల ద్రోహం తరువాత.తెలంగాణ ఆకాంక్షలు తీరుస్తుందనుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్నాం,కానీ తెలంగాణ సమాజం మళ్ళీ పోరాట జెండా ఎత్తుకునే పరిస్థితులకు కాంగ్రెస్ పాలన తీరే కారణమైతున్నది .గత ప్రభుత్వం తప్పిదాలనే కొనసాగిస్తున్న కాంగ్రెస్ పై ప్రజలలో సహజంగా వ్యతిరేకత పెరిగే అవకాశముండకపోదు.
-మైసా శ్రీనివాస్ రాష్ట్ర
పూర్వ ప్రధాన కార్యదర్శి
 TPTF. తెలంగాణ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *