పసిప్రాయంలోనే లైంగిక క్షోభ!

“గృహహింస మరియు పితృస్వామ్య వైఖరి కేవలం నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకే పరిమితం కాలేదు. అక్షరాస్యతలో, సామాజిక చైతన్యంలో దేశంలోనే మొదటి వరుసలో ఉంటాయని మనం భావించే కేరళ, గోవా, మిజోరాం వంటి రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో గత సర్వే కంటే హింస పెరగడం అత్యంత విస్మయానికి గురిచేస్తోంది. చదువు పెరిగినంత మాత్రాన, ఆర్థిక స్థితిగతులు మెరుగైనంత మాత్రాన మహిళలను తోటి మనుషులుగా చూసే సంస్కారం కొందరిలో రావడం లేదనడానికి ఇవే బలమైన ఆధారాలు..”

 సాధికారత ముసుగులో నలిగిపోతున్న నారీ లోకం!
వెంక గారి భూమయ్య
సీనియర్ జర్నలిస్ట్
9848559863

భారతదేశ ఆత్మ మరియు హృదయం గ్రామాల్లోనే కొట్టుకుంటుందని జాతిపిత మహాత్మా గాంధీ ఒకప్పుడు ఎంతో నొక్కి చెప్పారు. కానీ నేడు అదే గ్రామీణ భారతంలో నాలుగు గోడల మధ్య మహిళల ఆర్తనాదాలు, మూగ రోదనలు ప్రతిధ్వనిస్తున్నాయనే చేదు నిజాన్ని తాజా గణాంకాలు అత్యంత ఘాటుగా సమాజం ముందు ఉంచాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) నివేదిక దేశంలోని విద్యావంతులను, పాలకులను, సామాజిక శ్రేయోభిలాషులను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. మనం ప్రతిరోజూ 21వ శతాబ్దపు డిజిటల్ విప్లవం గురించి, నూతన అంతరిక్ష యాత్రల గురించి, మహిళా సాధికారత గురించి వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్న ఈ తరుణంలో.. పల్లెల్లో ఇళ్ల మధ్య సాగుతున్న శారీరక, మానసిక మృగానందం దేశ సమగ్ర వృద్ధిని, మన మానవతా సంస్కృతిని తీవ్రంగా వెక్కిరిస్తోంది. జాతీయ స్థాయిలో గృహహింస కేసుల సగటు స్వల్పంగా తగ్గడం కొంతవరకు ఊరట కలిగించే పరిణామమే అయినా, పట్టణాలతో పోలిస్తే పల్లెటూరి మహిళలు అనుభవిస్తున్న నరకయాతన చట్టాల వైఫల్యాన్ని, సమాజంలో శతాబ్దాలుగా పాతుకుపోయిన పితృస్వామ్య అహంకారాన్ని బట్టబయలు చేస్తోంది. గత సర్వేతో పోల్చితే, భారతదేశంలో లింగ-ఆధారిత హింస 29.2 శాతం నుండి 22.3 శాతానికి తగ్గుముఖం పట్టింది. దాదాపు 7 శాతం తగ్గుదల నమోదు కావడం ఒక మంచి సంకేతమే అయినప్పటికీ, ఇప్పటికీ ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఏదో ఒక రూపంలో గృహహింసకు బలికావడం మన నైతిక పతనానికి అద్దం పడుతోంది.

     తాజా సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ మంది మహిళలు ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు, సొంతంగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు మరియు బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటూ ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. కానీ, ఈ బాహ్య సాధికారత వారిని భర్తల చేతిలో జరిగే శారీరక, లైంగిక హింస నుండి ఎంతమాత్రం రక్షించలేకపోతోందని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం నిరూపిస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా, సొంతంగా సంపాదిస్తున్నా కూడా అర్ధరాత్రి వేళ భర్త చూపే రాక్షసత్వానికి మహిళలు అబలలుగా మారక తప్పడం లేదు. గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే, 18 నుండి 49 ఏళ్ల వయస్సు గల వివాహిత మహిళల్లో భర్త నుంచి హింసను ఎదుర్కొంటున్న వారిలో గ్రామీణ ప్రాంత మహిళల వాటా 24.4 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం 17.5 గా నమోదైంది. అంటే, నగరాల కంటే పల్లెల్లో పురుషాహంకార పోకడలు, గృహహింస విపరీతంగా పెచ్చుమీరిపోయాయి.
     ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, ఒక జీవికి జన్మనిచ్చే అత్యంత సున్నితమైన గర్భధారణ సమయంలో కూడా మహిళలపై శారీరక దాడులు జరుగుతున్నాయి. గర్భధారణ సమయంలో హింసను ఎదుర్కొన్న వారి సంఖ్య జాతీయంగా 2.7 శాతానికి తగ్గినప్పటికీ, ఇక్కడ కూడా పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళలే ఎక్కువగా బాధితులుగా మిగిలిపోతున్నారు. మాతృత్వాన్ని గౌరవించే దేశంలో, గర్భిణీ అని కూడా చూడకుండా భార్యలపై చేతులు లేపుతున్నారంటే పల్లెల్లో మానసిక వికృతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు, 18-29 ఏళ్ల వయస్సు గల యువతుల్లో చాలా మంది తాము మైనర్లుగా ఉన్నప్పుడే, అంటే పద్దెనిమిది ఏళ్లు నిండకముందే లైంగిక హింసకు గురయ్యామని నివేదించడం దేశంలో పసిపిల్లల రక్షణకు ఉన్న గ్యారెంటీని ప్రశ్నార్థకం చేస్తోంది.
     అయితే, ఈ గృహహింస మరియు పితృస్వామ్య వైఖరి కేవలం నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకే పరిమితం కాలేదు. అక్షరాస్యతలో, సామాజిక చైతన్యంలో దేశంలోనే మొదటి వరుసలో ఉంటాయని మనం భావించే కేరళ, గోవా, మిజోరాం వంటి రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో గత సర్వే కంటే హింస పెరగడం అత్యంత విస్మయానికి గురిచేస్తోంది. చదువు పెరిగినంత మాత్రాన, ఆర్థిక స్థితిగతులు మెరుగైనంత మాత్రాన మహిళలను తోటి మనుషులుగా చూసే సంస్కారం కొందరిలో రావడం లేదనడానికి ఇవే బలమైన ఆధారాలు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు పుదుచ్చేరి వంటి కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ గ్రామీణ మహిళల కంటే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలే భర్తల నుండి ఎక్కువ వేధింపులను, హింసను ఎదుర్కొంటున్నారు. నగర జీవితంలో ఉండే విపరీతమైన ఆర్థిక ఒత్తిళ్లు, యాంత్రిక జీవనం మరియు కుటుంబాల మధ్య సమన్వయ లోపం నగరాల్లోని నాలుగు గోడల మధ్య నరకాన్ని సృష్టిస్తున్నాయి.
      ఈ సామాజిక విపత్తుకు కేవలం మద్యం మహమ్మారిని మాత్రమే కారణంగా చెప్పి తప్పించుకోలేం. పల్లెల్లో నాణ్యమైన చైతన్య లోపం, చట్టాలపై అవగాహన లేకపోవడం మరియు ఎంత హింసించినా భర్త ఇల్లే శరణు అనే సాంప్రదాయ బంధనాలు మహిళలను మరింతగా కుంగదీస్తున్నాయి. నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు ఎన్ని తెచ్చినా, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచినా ఇళ్లల్లో జరిగే హింసను అడ్డుకోవడం కేవలం ప్రభుత్వాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని సగర్వంగా ప్రకటిస్తున్న తరుణంలో, దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు ఇళ్లలోనే రక్షణ లేకపోతే ఆ వృద్ధికి, ఆ సంపదకు అర్థం లేదు. ఇప్పటికైనా కేవలం మహిళల అభ్యున్నతి కోసం ఆర్థిక పథకాలు ప్రకటించడమే కాకుండా, పురుషుల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చేలా పాఠశాల స్థాయి నుంచే లింగ సమానత్వ పాఠాలను విధిగా బోధించాలి. క్షేత్రస్థాయిలో కౌన్సిలింగ్ కేంద్రాలను పెంచి, బాధితులకు తక్షణ న్యాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలి. అప్పుడే పల్లె కన్నీరు తుడువబడుతుంది, దేశానికి నిజమైన సాధికారత లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *