ఎస్ఐఆర్‌ నోటీసులపై ఇంటివద్దే పత్రాల సేకరణ

– వోటర్లకు ఊరట కల్పించేలా ఎన్నికల సంఘం నిర్ణయాలు
– దిల్లీ, మహారాష్ట్రల్లో దరఖాస్తులు, అభ్యంతరాల గడువు పొడిగింపు

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 26: వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వోటర్ల నుంచి ఇంటివద్దే పత్రాలను సేకరించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. సంబంధిత రికార్డులతో అనుసంధానం కాని (అన్‌మ్యాప్డ్‌), వివరాల్లో తార్కిక అసంగతతలు ఉన్న కారణంగా నోటీసులు అందుకున్నవారి ఇళ్లకు బూత్‌స్థాయి అధికారులు (బీఎల్ఓలు) వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు న్యూదిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు డాక్టర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, డాక్టర్‌ వివేక్‌ జోషి సమావేశంలో పాల్గొన్నారు. బీఎల్ఓలు సేకరించిన పత్రాలను ‘ఈసీనెట్‌’లో అప్‌లోడ్‌ చేస్తారు. వాటి ఆధారంగా ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ) నిర్ణయం తీసుకుంటారు. ఈ వోటర్లను విచారణ కోసం ఈఆర్ఓ లేదా సహాయ ఎన్నికల నమోదు అధికారి (ఏఈఆర్ఓ) కార్యాలయాలకు పిలవాల్సిన అవసరం లేదని సంఘం పేర్కొంది. ఈఆర్ఓ నిర్ణయించే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే విచారణ నిర్వహించాలని, సాధ్యమైనంతవరకు ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని సూచించింది. అవసరమైతే వోటరు తన తరఫున విచారణకు హాజరయ్యేందుకు కుటుంబంలోని వయోజన సభ్యుడికి అధికారం ఇవ్వవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌ విచారణ సదుపాయాలను బలోపేతం చేయాలని ఆదేశించింది. రాత్రి ఆశ్రయ కేంద్రాల్లో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయులకు సహాయపడేందుకు అవసరమైన సంఖ్యలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించాలని పేర్కొంది. ఎస్ఐఆర్‌ కోసం ఫారం–6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఎన్నికల సంఘం తన ప్రకటనలో తెలిపింది. ఎస్ఐఆర్‌ కాలానికి వెలుపల వోటర్ల నమోదు నిబంధనలు–1960 ప్రకారం వర్తించే ఫారాలను ఉపయోగించనున్నట్లు వివరించింది. క్షేత్రస్థాయి అధికారులకు వారి చట్టబద్ధ అధికారాలు, విధులకు అనుగుణంగా ఈసీనెట్‌ వ్యవస్థలో ప్రవేశ అనుమతులు ఉన్నాయని సంఘం పేర్కొంది. ఈ వ్యవస్థ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నదీ లేనిదీ మరోసారి నిర్ధారించేందుకు సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలో కమిటీ సమీక్ష చేపట్టనుంది. ఐఐటీ లేదా ఐఐఐటీకి చెందిన స్వతంత్ర నిపుణుడు సభ్యుడిగా ఉండే ఈ కమిటీ ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తుంది. గత కొన్ని నెలల్లో రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల సూచనల మేరకు పోర్టల్‌లో పలు మెరుగుదలలు చేసినట్లు సంఘం తెలిపింది. క్షేత్రస్థాయి అధికారులకు మరింత వెసులుబాటు అవసరమైతే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామని పేర్కొంది. ఇకపై ఐటీ మాడ్యూళ్లు, పోర్టళ్లకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలను ఎన్నికల సంఘం ఆమోదానికి ముందు అధికారుల కమిటీలో చర్చించాలని నిర్ణయించింది. దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజ్ఞప్తి మేరకు వోటర్ల జాబితాకు సంబంధించిన దరఖాస్తులు, అభ్యంతరాల దాఖలు గడువును అక్టోబర్‌ 30 వరకు పొడిగించింది. నోటీసులు, దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కార గడువును నవంబర్‌ 30 వరకు పెంచింది. మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రంలో దరఖాస్తులు, అభ్యంతరాల దాఖలు గడువును అక్టోబర్‌ 12 వరకు, వాటితోపాటు నోటీసుల పరిష్కార గడువును నవంబర్‌ 10 వరకు పొడిగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *