– వివరాల్లేని మాన్యువల్ టికెట్లు
– పిక్ అండ్ డ్రాప్ వాహనాలకూ వసూళ్ల ఆరోపణలు
– ‘ఇండియన్ రైల్వే’ పేరుతో కాంట్రాక్టర్ సిబ్బంది ఐడీలు
– విచారణకు ప్రయాణికుల డిమాండ్
వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో పార్కింగ్ నిర్వహణ, రుసుముల వసూళ్ల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్ పార్కింగ్ ప్రాంతంలో నిర్ణీత రుసుముల బోర్డు లేకపోవడం, తేదీ, వాహనం నంబర్, ఎంట్రీ–ఎగ్జిట్ సమయాలు నమోదు చేయని మాన్యువల్ టికెట్లు ఇవ్వడం, ఒకసారి ఉపయోగించిన టికెట్లను తీసుకుని మళ్లీ వినియోగిస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ప్రయాణికులను కేవలం దింపేందుకు లేదా తీసుకెళ్లేందుకు వచ్చే వాహనాల నుంచి కూడా రుసుము వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు సమగ్ర విచారణ జరపాలని ప్రయాణికులు కోరుతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కాంట్రాక్టర్‌గా బూర ఎల్లస్వామి గౌడ్ పేరు అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై ఉంది. కాంట్రాక్ట్ కాలాన్ని 26-07-2026 నుంచి 25-07-2029 వరకు, జీఎస్‌టీఎన్ GSTIN 36AJRPB7243E1Z8గా పేర్కొన్నారు. అయితే రైల్వే నిర్ణయించిన పార్కింగ్ రేట్ల బోర్డును స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, సైకిళ్లు నిలిపే ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేయగా కార్ పార్కింగ్ ప్రాంతంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రేట్ల పట్టికను ప్రదర్శించలేదనే ఆరోపణ ఉంది.
కారుకు ఎంత?.. అక్కడ బోర్డే లేదు!

టూ వీలర్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న బోర్డు ప్రకారం కారుకు మొదటి రెండు గంటలు లేదా వాటిలో భాగానికి జీఎస్‌టీతో కలిపి రూ.20, ఆ తర్వాత ప్రతి గంట లేదా దాని భాగానికి రూ.10గా పేర్కొన్నారు. కానీ కార్ పార్కింగ్ వద్దనే ఈ వివరాలు ప్రదర్శించకపోతే తాము ఎంత చెల్లించాలో ఎలా తెలుస్తుందని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
టికెట్ ఉంది.. తేదీ, టైమ్, వాహనం నంబర్ లేవు
కార్ పార్కింగ్‌లో ఇస్తున్న మాన్యువల్ టికెట్లపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశీలనకు లభించిన ‘రైల్వే. సైకిల్ అండ్ స్కూటర్ స్టాండ్ రైల్వే . వెహికిల్ స్టాండ్, వరంగల్ కార్ పార్కింగ్’ టికెట్‌పై సీరియల్ నంబర్ ఉన్నప్పటికీ తేదీ, వాహనం నంబర్, ఎంట్రీ టైం, ఎగ్జిట్ టైం వంటి కీలక వివరాలు నమోదు చేయలేదు. వాహనం బయటకు వెళ్లేటప్పుడు టికెట్‌ను తిరిగి తీసుకొని, అదే టికెట్‌ను మరో వాహనదారుడికి ఇచ్చి ఒకే సీరియల్ నంబర్‌ను పలుమార్లు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలపై నిజానిజాలను టికెట్ బుక్స్, సీసీ టీవీ, రోజువారీ వాహనాల సంఖ్య, వసూళ్లు, జీఎస్టీ లెక్కలను సరిపోల్చి అధికారులు తేల్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పిక్ అండ్ డ్రాప్‌కూ ఫీజా?
ప్రయాణికులను స్టేషన్ వద్ద దింపి వెళ్లేందుకు లేదా రైలు దిగిన వారిని తీసుకెళ్లేందుకు వచ్చే వాహనాలకు నిర్ణీత ఉచిత పిక్ అండ్ డ్రాప్ సమయం ఉండాలన్నది మరో కీలక అంశం. అందుబాటులో ఉన్న రైల్వే పార్కింగ్ నిబంధనల్లో డిసిగ్నేటెడ్ పిక్ అండ్ డ్రాప్ ప్రాంతంలో నిర్ణీత ఉచిత సమయం వరకు పార్కింగ్ రుసుము వసూలు చేయరాదనే నిబంధనలున్నాయి. అయితే వరంగల్ స్టేషన్‌కు వర్తించే ఖచ్చితమైన ఉచిత సమయ పరిమితి ఎంతన్నది అధికారులు స్పష్టం చేసి ప్రవేశ ద్వారం, కార్ పార్కింగ్, పిక్ అండ్ డ్రాప్ ప్రాంతాల్లో బోర్డుల ద్వారా తెలియజేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే ప్రయాణికులను దింపి లేదా తీసుకొని వెళ్లేందుకు వచ్చిన వాహనాల నుంచి కూడా మాన్యువల్ టికెట్లు ఇచ్చి రుసుము వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిర్ణీత ఉచిత సమయంలోపే వెళ్లిపోయే వాహనాల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలితే దాన్ని తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
‘ఇండియన్ రైల్వే ’ ఐడీ ఎవరిచ్చారు?
పార్కింగ్ సిబ్బంది ఉపయోగిస్తున్న గుర్తింపు కార్డులపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశీలనకు లభించిన కార్డుపై పెద్ద అక్షరాలతో “ఇండియన్ రైల్వే – వరంగల్ పార్కింగ్ స్టాండ్ – ఐడెంటిటీ కార్డ్ ” అని, డిసిగ్నేషన్ గా “ అటెండర్ పార్కింగ్ స్టాండ్ ” అని ఉంది. అదే కార్డు దిగువన “ బి.ఎల్లయ్య స్వామి , హన్మకొండ ” అని కనిపిస్తోంది. ఈ కార్డును రైల్వే జారీ చేసిందా? కాంట్రాక్టర్ జారీ చేసిందా? కాంట్రాక్టర్ జారీ చేసినట్లయితే ‘ఇండియన్ రైల్వే ’ పేరును ఈ విధంగా ఉపయోగించేందుకు అనుమతి ఉందా? అనే అంశాలపై రైల్వే అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కార్ పార్కింగ్‌లో రేట్ల బోర్డు లేకపోవడం, వివరాల్లేని మాన్యువల్ టికెట్లు, టికెట్ల పునర్వినియోగ ఆరోపణలు, పిక్ అండ్ డ్రాప్ వాహనాల నుంచి వసూళ్ల ఆరోపణలు, ‘ఇండియన్ రైల్వే’ పేరుతో కనిపిస్తున్న సిబ్బంది ఐడీ కార్డులు—ఈ మొత్తం వ్యవహారంపై దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు. పారదర్శకత కోసం కంప్యూటరైజ్డ్ టికెటింగ్ అమలు చేసి, రేట్లు–ఉచిత పిక్ అండ్ డ్రాప్ సమయం–కాంట్రాక్టర్ వివరాలు–ఫిర్యాదు చేయాల్సిన అధికారుల ఫోన్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




