– పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు
– టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం వర్గం
చెన్నై, మే 12: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు బయటపడ్డాయి. పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు మొదలయ్యింది. తాజాగా ఆ పార్టీలోని సీవీ షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగంకు మద్దతు ప్రకటించింది. ఆయన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేతో చేతులు కలపాలని అన్నాడీఎంకే అనుకుందని, అందుకే పళనిస్వామి వర్గం నుంచి తాము విడిపోయామని మంగళవారం షణ్ముగం మీడియాకు తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. వరుస ఓటములకు పళనిస్వామే కారణమని విమర్శించారు. పార్టీ పదవి నుంచి ఆయన దిగిపోవాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే దశాబ్ద కాలంగా పలు ఓటములను చవిచూసిందని, మూడుసార్లు చిరకాల ప్రత్యర్థి డీఎంకే చేతిలో ఓడిపోతే, గత నెలలో టీవీకే చేతిలో మరో ఓటమి చవిచూసిందని షణ్ముగం తెలిపారు. పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అన్నాడీఎంకే భవిష్యత్తుపై కూలంకషంగా చర్చించాలని అన్నారు. ఎన్నికల్లో విజేతగా నిలిచిన టీవీకేకు మద్దతివ్వాలని తాము నిర్ణయించామన్నారు. ‘53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే మా పార్టీ రాజకీయాలు నడిచాయి.. చరిత్ర ఇలా ఉంటే డీఎంకే మద్దతుతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు.. అయితే మెజారిటీ సభ్యులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం అంటే అన్నాడీఎంకే సొంత ఉనికి కోల్పోవడమే అవుతుంది.. ప్రస్తుతం మా దృష్టి పొత్తులపై లేదు.. పార్టీని పునరుద్ధరించి పటిష్టం చేయడమే ఉద్దేశం.. అంతిమంగా ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’ అని షణ్ముగం తెలిపారు. సొంత పార్టీని చీల్చే ఉద్దేశం లేదని షణ్ముగం వివరణ ఇచ్చారు. పార్టీ కీలక నాయకత్వంపై పోరాటంగా దీనిని పేర్కొన్నారు. ముఖ్యంగా విజయ్‌తో పొత్తుకు గత వారంలో నిరాకరించిన మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా తామంతా తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



