మానవ ఆరోగ్యానికి వినాశకరమైన పరిణామం!

మంచు మాటున మహా కాలుష్యం
 వయస్సుపైనా ప్రభావం చూపుతున్న వైనం..

ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. మన దేశంలోని అనేక పట్టణాలు ప్రాంతాలు వాయుకాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.  ఆంధ్రా కాశ్మీర్‌గా కనువిందు చేసే చింతపల్లి, లంబసింగి ప్రాంతాలు దట్టమైన పొగమంచు పొరలచాటున కనిపించే అందమైన పర్వతాలు, లోయలు కాశ్మీర్‌ను తలపిస్తాయి. ఆహ్లాదకరంగా కనిపించే దట్టమైన పొగమంచు మాటున కనిపించని కాలుష్యం కాచుకొని వుంటోంది.  అటు కాలుష్యం..  ఇటు పొగమంచుతో దేశంలోని చాలా నగరాలు దిల్లీ బాటలో పయనిస్తున్నాయి. వాహనాలు, పరిశ్రమల నుంచి వొచ్చే కాలుష్యంతో నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దేశంలోని మహానగరాల గాలి కాలుష్యాన్ని కట్టడి చేయడానికి నిర్దిష్ట ప్రణాళికలు లేవు. పెరుగుతున్న చలి తీవ్రత, పొగమంచుకు వాయు కాలుష్యం తోడ్కె..  మరింత ప్రమాదకరంగా మారుతున్నది.  రాబోయే రోజులలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, సాధారణం కంటే అధికంగా వుంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని దిల్లీ కాలుష్య కోరల్లో విలవిలలాడుతోంది. వాతావరణ కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి యేటా 70 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని, ఈ సంఖ్య భారత్‌లో 16 లక్షలకు పైగా వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వాయు కాలుష్యం నేరుగా వయస్సుపైనా ప్రభావం చూపుతోందని మరో అధ్యయనం చెబుతోంది.

చలి తీవ్రత క్రమేపీ పెరిగి, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఇది కేవలం అసౌకర్యానికి సంబంధించిన విషయం కాదు. మానవ ఆరోగ్యానికి వినాశకరమైన పరిణామాలను కలిగించే అంశంగా చూడాలి.  గాలిలో పెరిగిన కాలుష్యం అనారోగ్యానికి కారణమౌతోంది. ప్రత్యేకించి వృద్ధులు, చిన్నపిల్లలు, ఇప్పటికే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాదకరం. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు వుంటాయని,  తగిన జాగ్రత్తలు అవసరమని వైద్యులు చెబుతున్నారు.

చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులున్నవారు ఈ సీజన్‌లో జాగ్రత్తగా వుండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. గాలి కాలుష్యంవల్ల న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ’చలి అనేది శారీరక సమస్య మాత్రమే కాదు, మానసిక, శారీరక భావోద్వేగ సమస్య కూడా’ అంటారో మానసిక శాస్త్రవేత్త. మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి రమణీయంగా, ఆహ్లాదకరంగానే వుంటుంది. దాని వెనుక పొంచివున్న కాలుష్యం, పొగమంచు, చలి తీవ్రత మనిషికే కాదు, జంతువులకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. దీన్ని ఈ రుతువులో వొచ్చే చిన్న సమస్యగా కాకుండా? ప్రజల ఆరోగ్య సమస్యగా భావించి, ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలి.
      -కె.ఎస్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page