ప్రస్తుతం 300 మెగావాట్లు.. మరో 2 గిగావాట్ల ఏర్పాటుకు అవకాశాలు సిద్ధం
పెట్టుబడిదారులను రాష్ట్ర అతిథులుగా గౌరవిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజాభవన్లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగ ప్రతినిధులతో సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26: దేశంలోనే డేటా సెంటర్ల (Telangana 5GW Data Centers) ఏర్పాటుకు తెలంగాణను ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో 5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గురువారం ప్రజాభవన్లో డేటా సెంటర్ల నిర్వాహకులు, గ్రీన్ ఎనర్జీ రంగ ప్రతినిధులతో ఆయన సమావేశమై పెట్టుబడుల అవకాశాలు, విద్యుత్ అవసరాలు, పరిశ్రమల విస్తరణపై చర్చించారు. పలువురు ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనకు ఇంధన, ఐటీ, పరిశ్రమల శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు పనిచేస్తున్నాయని, మరో 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం విస్తరిస్తున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోందని, హైదరాబాద్లో తేమ శాతం తక్కువగా ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం వీటి నిర్వహణకు ఎంతో అనుకూలమని పేర్కొన్నారు.
పెట్టుబడిదారులకు పూర్తి భరోసా: తెలంగాణకు పెట్టుబడులతో వచ్చే ప్రతి ఒక్కరినీ సంపద సృష్టికర్తలుగా, రాష్ట్ర అతిథులుగా ప్రభుత్వం గౌరవిస్తుందని భట్టి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూ పెట్టుబడిదారులకు మరింత అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు డేటా సెంటర్ల నిర్వాహకులు, గ్రీన్ ఎనర్జీ సంస్థలు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.





