మన చరిత్ర మనమే రాసుకోవాలి
రాజ్యాంగం ఆమోదించిన ఈరోజే మహిళలకు నిజమైన పండుగ
స్త్రీలను మనుషులుగా గుర్తించింది రాజ్యాంగమే
వేల ఏళ్లపాటు స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా చూశారు
ప్రతి ఇంట్లో రాజ్యాంగం వుండాలి
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : మహిళలను మనుషులుగా గుర్తించింది భారత రాజ్యాంగం మాత్రమేనని..ఆ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26 వ తేదీయే మనకు అసలు సిసలైన పండుగ రోజని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ రోజును మహిళలంతా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గురువారం “సంవిధాన్ దినోత్సవం” సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “మహిళలు- రాజ్యాంగం” అనే సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగం మాత్రమే అన్ని హక్కులు కల్పించిందన్నారు. ఆడ, మగ అనే భేదం లేకుండా ఆడవాళ్లు కూడా మనుషులేనని వారికి కూడా మగవారితో సమానంగా ఓటు హక్కును కల్పించింది కూడా రాజ్యాంగమేనని చెప్పారు. రాజ్యాంగం మహిళలకే ఎక్కువ హక్కులు కల్పించిందని చెప్పారు. రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు నుంచే మహిళలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు.
రాజ్యాంగం అమలు చేస్తే చాలు
రాజ్యాంగం మహిళలకు అన్ని హక్కులు ఇచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ హక్కులను వినియోగించుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కూడా మహిళలు ఉద్యోగం చేస్తే ఆమె సంపాదన భర్తకో, తండ్రికో ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇళ్లు, స్థలం ఉన్న మహిళల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టేంత మాత్రమే ఉంటుందని చెప్పారు. సినిమాల్లో గానీ, కూలీ పని లో గానీ, ఐటీ ఉద్యోగాల్లో గానీ ఎక్కడైనా సరే మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు పనిచేసినప్పటికీ వాళ్లకు మగవాళ్లతో సమాన వేతనం ఇవ్వటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఏ కులంలో, ఏ మతంలో పుట్టిన సరే ఆడవాళ్లపై వివక్ష ఉంటుందన్నారు. దళిత, బీసీ మహిళలకు ఒక విధమైన వివక్ష ఉంటే, అగ్రకులాల్లో పుట్టిన మహిళలపై మరో విధమైన వివక్ష ఉంటుందన్నారు. ఇప్పటికీ కూడా ఆడవాళ్లకు వాళ్ల పిల్లల పేరు పెట్టే విషయంలో కూడా స్వేచ్ఛ లేదన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు కొంత మహిళ హక్కుల గురించి పోరాటం చేస్తాయని భావిస్తామని..కానీ ఆ పార్టీలో కూడా మహిళలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మహిళ నక్సల్స్ ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. తాము జనాభాలో సగం ఉన్నామని అందుకు తగిన విధంగా అవకాశాలు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. మగవాళ్లతో సమానంగా తమను చూడాలని మాత్రమే కోరుతున్నామన్నారు. అవన్నీ జరగాలంటే మన రాజ్యాంగాన్ని యధాతథంగా అమలు చేస్తే చాలన్నారు.
మన చరిత్ర మనమే రాసుకోవాలి
ఆడవాళ్లపై ఆధిపత్యం చెలాయించేందుకు మనల్ని తక్కువ చేసి చూపారని కవిత అన్నారు. ఆధిపత్యం చెలాయించే వాళ్లు ముందు మనసు పై కొడతారన్నారు. మనకు తెలివి లేదని పదే పదే అంటూ ఆత్మన్యూనతకు గురిచేస్తారన్నారు. సాయుధ రైతాంగ పోరాటం సహా ఎన్నో పోరాటాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఫైట్ చేశారని కానీ మహిళల పోరాటాన్ని ఎక్కడ రాయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగ పోరాటంపై 21 పుస్తకాలు వస్తే అందులో 20 మగవాళ్లే రాశారని..ఎక్కడ కూడా పోరాటంలో ఆడవాళ్ల పాత్ర గురించి రాయలేదన్నారు. ఒక్కరే మహిళ రాసిన పుస్తకం ద్వారా చాకలి ఐలమ్మ పోరాటం మనకు తెలిసిందని చెప్పారు. మన చరిత్ర మనమే చెప్పుకోవాలని..లేదంటే చరిత్ర ఉండదని చరిత్ర మనకు చెబుతుందన్నారు.
మహిళలకు అవమానాలు
సమాజం కోసం పనిచేసేందుకు ముందు వచ్చే మహిళలను ఇప్పటికీ అవమానిస్తున్నారని కవిత విచారం వ్యక్తం చేశారు. ఆనాడు మహిళలకు విద్య చెప్పేందుకు కృషి చేసిన సాయిత్రి భాయ్ పూలే పై పెండ, మురికి నీళ్లు చల్లారని..నేడు రాజకీయాల చేసే మహిళలపై మురికి కామెంట్లతో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటికి ఇప్పటికీ ఏ మార్పు లేదన్నారు. సాయిత్రి భాయ్ పూలే చదువు చెప్పేందుకు ఇల్లు ఇచ్చిన ఫాతిమా షేక్ అనే మహిళను కూడా అవమానించారని గుర్తు చేశారు. ఇప్పటికీ కూడా ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ చనిపోతుంటే ఎందుకు ఏ పార్టీ మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మహిళల సమస్యలను మగవాళ్లు పట్టించుకోవటం లేదన్నారు. ఇవ్వాళే న్యూస్ పేపర్లో రెండు సంఘటనలు చూసి ఆవేదనకు గురయ్యాననని ఆమె చెప్పారు. ఇంటర్ చదువుతున్న అబ్బాయి..తనకు నో చెప్పిందని అమ్మాయిని చెప్పుతో కొట్టాడని న్యూస్ లో చదివానని చెప్పారు. తనకు నో చెబితే చెప్పుతో కొట్టే అధికారం, అహంకారం వాడికి ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మరో సంఘటనలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి హాస్టల్ బాత్ రూమ్ లో ప్రసవించిందని చదివన్నారు. అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఉన్న సంగతి హాస్టల్ సిబ్బందికి, ఆమె చదువుతున్న కాలేజ్ అధ్యాపకులకు తెలియకపోవటమేమిటనీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే మహిళల భద్రత విషయంలో ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే మనల్ని మనం రక్షించుకునేందుకు, మన హక్కులను సాధించుకునేందుకు ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.
తెలంగాణ రుద్రమ సేన
రాజ్యాంగ ఆమోదించుకున్న రోజును పురస్కరించుకొని తెలంగాణ రక్షణ సేన మహిళ విభాగం పేరును తెలంగాణ రుద్రమ సేనగా నామకరణం చేస్తున్నామని కవిత ప్రకటించారు. తెలంగాణ రుద్రమ సేన పోస్టర్ ను మహిళా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. రుద్రమ దేవి మాదిరిగా అవసరమైతే కత్తి పట్టి పోరాటం చేయాలని మహిళ నేతలకు ఈ సందర్భంగా సూచించారు. ప్రతి మహిళ కూడా గల్లిగల్లీ తిరుగుతూ ఇంటింటికి రాజ్యాంగం గురించి అవగాహన కల్పించాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ మహిళ ఇన్ ఛార్జీలు ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.
అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించి ఈ సదస్సును కవిత ప్రారంభించారు. సదస్సులో టీఆర్ఎస్ మహిళ నేతలు మనోజ గౌడ్, వేముల భవాని, సూరారపు కృష్ణవేణి, కావేటి సబిత, సండ్ర మాలతి, పగిడాల శ్రావణి, రజియా బేగం, హలిమా బేగం, తిరుపతి పరమేశ్వరీ, లలితా యాదవ్, సౌజన్య రెడ్డి, గీత, అంశం శివరాణి, ఝాన్సీ, అనితా చౌదరి తదితరులు ప్రసంగించారు.





