లంబాడాలకు అన్ని పార్టీలు తీర‌ని అన్యాయం

వీరి పోరాట పటిమను గుర్తించింది కేవలం ఇందిరమ్మ మాత్రమే
జైపాల్ రెడ్డి కృషితో ఎస్టీ వర్గంలోకి లంబాడాలు
ప్రతి లంబాడా ఇంట్లో ఇందిరమ్మ ఫోటో
ఆదర్శమూర్తి సంత్ సేవాలాల్
సమాజానికి సన్మార్గాన్ని చూపిన మహనీయుడు
మద్దిమడుగు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మద్దిమడుగు, ప్రజాతంత్ర, నవంబర్ 26: అన్ని పార్టీలు లంబాడా సోదరులను వోట్లు వేసే యంత్రాలుగా, రాజకీయ అవసరాలకు ఉపయోగపడేవారిగా చూశాయని ఇందిరాగాంధీ మాత్రమే లంబాడా సోదరుల పోరాటపటిమను గుర్తించారన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  మద్దిమడుగులో జన్మించిన సంత్ సేవాలాల్ మహారాజ్ (Sant Sevalal Maharaj Birthplace) ఒక మంచి సన్మార్గాన్ని చూపించారని అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 71 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రూ. 38 కోట్లతో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ పనులు, భారీ విగ్రహ ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని సేవాలాల్ మహారాజ్ సూచించారన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ఆదర్శమూర్తిగా నిలబడటమే కాదు, లంబాడాలందరికీ ఆరాధ్య దైవంగా నిలిచారన్నారు.
ఆనాడు బ్రిటిష్ దొరలను గడగడలాడించిన జాతి లంబాడా జాతి. నిజాం నవాబును ఎదుర్కొన్న జాతి.నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తండాల్లో ఆశ్రయం ఇచ్చిన జాతి.నమ్మితే ప్రాణాలు ఇచ్చే జాతి లంబాడా జాతి.బలహీన వర్గాల్లో ఉన్న లంబాడాల ఆర్థిక వెనుకబాటుతనాన్ని చూసి జైపాల్ రెడ్డి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి తీసుకెళ్లి 1976లో వారిని షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో చేర్చారని గుర్తుచేశారు. రిజర్వేషన్ల కారణంగా లంబాడాలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అనేక ఉన్నతస్థాయి ఉద్యోగాలు పొందారు. నాయకులుగా అనేక పదవులు సాధించారు. లంబాడాలు మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.దున్నేవాడికే భూములు ఇవ్వాలన్న ఉద్దేశంతో 12 లక్షల ఎకరాలను ఇందిరాగాంధీ లంబాడా సోదరులకు పంపిణీ చేశారని గుర్తుచేశారు.

ప్రతి లంబాడా ఇంట్లో ఇందిరమ్మ బొమ్మ సంత్ సేవాలాల్ పక్కన కనిపిస్తుంది.ఆ కుటుంబంపై ప్రేమతో అప్పటి తరం వారు ఇందిరమ్మ పేరు, ఈ తరం వారు ప్రియాంక పేరు పెట్టుకుంటున్నారు.లంబాడీలకు ఇచ్చిన గుర్తింపునకు విశ్వాసం చూపిస్తూ వారి పేర్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే అందులో 4 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీలకే అందాయి. ఎస్సీ, ఎస్టీలు పక్కా ఇళ్లు కట్టుకుని ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. 3.40 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తే అందులో అత్యధికంగా లంబాడీలు లబ్ధి పొందుతున్నారు..ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అత్యధికం గిరిజన, ఆదివాసీ సోదరులకే అందుతున్నాయి.అచ్చంపేట, నల్లమల నేను పుట్టి పెరిగిన ప్రాంతం.ఈ ప్రాంత బిడ్డనని చెప్పుకున్నప్పుడల్లా నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.మాట ఇస్తే ఆ మాట కోసం మట్టిలో కలిసిపోయినా సరే నిలబెట్టుకునే తత్వం ఈ ప్రాంతం నుంచే అబ్బిందన్నారు.

ప్రచార సమయంలో వంశీకృష్ణను గెలిపిస్తే అచ్చంపేటకు ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారని ఆనాడు చెప్పాను.ఇప్పుడు రూ.450 కోట్ల నిధులను అచ్చంపేటకు తీసుకువచ్చాను.ప్రస్తుతం ఉన్న 16 ఎకరాలకు మరో నాలుగు ఎకరాలు సేకరించి మొత్తం 20 ఎకరాల్లో దేశానికే తలమానికమైన సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయాన్ని నిర్మిస్తాం. లంబాడా సోదరులు పార్టీకి అండగా నిలబడాలి.లంబాడాల ఉద్యోగ, ఉపాధి, అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తానన్నారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా లంబాడా సోదరుడిని నియమిస్తాం.రాజకీయాల్లో మీకు రావాల్సిన కోటాను ఢిల్లీకి వెళ్లి తీసుకువస్తాం..లంబాడా సోదరుల పాలన, అభ్యున్నతికి పాటుపడతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *