క్షుద్రపూజల ఆరోపణలపై పరువు నష్టం కేసు

– తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు ఈడుస్తాం
– ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు
– దానం విషయంలో కోర్టు తీర్పు రేవంత్కు చెంపపెట్టు
– మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలి
– మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: క్షుద్ర పూజలు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్  చేస్తున్న అసత్య ప్రచారంపై  లీగల్ గా ముందుకు వెళ్తున్నామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ హరీష్ రావు వెల్లడించారు. ఆధారాలతో పరువు నష్టం కేసు దాఖ‌లు చేశామని, కోర్టు పిటీషన్ స్వీకరించింద‌ని, వచ్చే బుధవారం స్టేట్మెంట్స్ రికార్డు చేస్తం అని చెప్పారన్నారు. దేవుళ్ల దగ్గరకు వెళ్తే కూడా క్షుద్ర పూజలు అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని హరీష్ రావు గురువారం నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవన్నారు. తమపై చిల్లరగా ఆరోపణలు చేస్తే వాళ్లలాగా స్థాయి దిగజారి మాట్లాడమన్నారు. ‘వాళ్లు బురదలో ఉన్నరు.. మాకు బురద అంటించే ప్రయత్నం చేస్తున్నరు.. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నరు.. మేనిఫెస్టో హామీలు ఏమైనవి అని అడిగితే లేనిపోని నిందలు వేస్తున్నార’న్నారు. శాసనసభలో కూడా అనేక అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వీటిపై స్పీకర్ కి నోటీసులు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్  ఉంటారు.. వారు ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటారు.. కానీ మూడేళ్లు అయినా నియామకం జరగలేదు.. ఎన్నిసార్లు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోవడం లేదు.. మూడేళ్ల నుంచి డైవర్షన్ డ్రామా తప్ప కాంగ్రెస్ పాలనలో చేసిందేం లేదు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని, మాటలతో కాలం గడుపుతున్నారని విమ‌ర్శించారు. రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తున్నదని, నీళ్ల కష్టాలు, కరెంట్ కష్టాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. ఎల్ నినో పేరు చెప్పి చేతులు ముడుచుకు కూర్చుంటున్నరు.. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీస్తే సహించలేకపోతున్నరు అని అన్నారు. ఎవరెన్ని అన్నా, ఎన్ని కేసులు పెట్టినా తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని చెప్పారు. గోబెల్స్ ప్రచారం చేస్తే వదిలిపెట్టం.. ఎంతటి వారినైనా వదలం.. ఎంత దూరం అయినా పోతాం. వారికి శిక్ష పడేదాక వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి సుప్రీం కోర్టు గట్టి తీర్పు ఇచ్చిందన్నారు. న్యాయస్థానం తీర్పు రేవంత్ కు చెంపపెట్టు అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న రేవంత్ కు ఇది గట్టి గుణపాఠం అవుతుంద‌న్నారు. అధికారంలో చేతిలో ఉంది కదా అని ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగ విలువలను కాలరాస్తుంటే ప్రతిపక్షాలను వేధిస్తుంటే న్యాయస్థానాలు గట్టి బుద్ది చెబుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా వస్తున్న తీర్పులను స్వాగతిస్తున్నామన్నారు. దానం ఒక్కరే కాదు పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రండి అని పిలుపునిచ్చారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణ జరుగుతున్న రాజ్యాంగ హననం కనిపించడం లేదా.. కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటే కనిపించడం లేదా.. మీ మాటల్లో నిజాయతీ లేదా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది అని చెప్పుకునే రాహుల్ గాంధీ మరి ఎందుకు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు అని ప్ర‌శ్నించారు. రాజ్యాంగం మీద మీకు నిజంగా గౌరవం ఉంటే,వెంటనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి అని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *