మాయ రోగం! బమ్మిడి జగదీశ్వరరావు

  • మెరుపు తీగెలు

రాళ్ళులాంటి కుర్రాళ్ళు. రాటుదేరిన కుర్రాళ్ళు. వాడలోంచి వూర్లోకి అడుగు పెట్టారు. ఊర్లోకే కాదు, యేకంగా జాతిభేదం పాటించే యింట్లోకి అడుగుపెట్టారు. అది కూడా వాళ్ళకి వాళ్ళుగా అడుగు పెట్టలేదు. ఆపదకు సాపదగా రమ్మంటే వచ్చారు. తప్పదంటే, తమ పెద్దలమాట కాదనలేక వచ్చారు.

అప్పటికీ ‘మేం యెందుకు వెళ్ళాలి?’ అని తమ పెద్దల్ని అడగకుండా వుండలేదు. ఆ పెద్దలు కూడా ‘పశువు సచ్చిపోతే తెచ్చినాం కదా?, అలాటిది మనిషి…’ అని యెదురు అన్నారు. ‘పశువయితే తింటాం, తోలయితే డప్పు చేసుకుంటాం… చెప్పు చేసుకుంటాం. చావబోతున్న మనిషిని యేమి చేసుకుంటాం’ అని కుర్రాళ్ళు తిరిగి అడగకుండా వుండలేదు.

కలరా నుంచి కరోనా దాక అనేక అంటువ్యాధుల్ని చూశారు. అందుకే వూళ్ళో వాళ్ళు రాలేదు. వాడలో వాళ్ళమీద ఆధారపడక తప్పలేదు.

మంచం మీద భారీ కాయం. భారానికి మంచం నవారు సాగి తెగినట్టే వుంది. ఆ మనిషి నడుము నేలకు ఆనినట్టే వుంది. అయినవాళ్ళు కూడా దూరంగా ముక్కులకి గుడ్డలు కట్టుకొని నిలబడ్డారు.

చివరి క్షణాలలాగే వున్నాయి, కాని అవెంత దూరంలో వున్నాయో యెవరూ చెప్పలేరన్నట్టు వుంది వాతావరణం. పొలానికో పొలం దగ్గర కల్లానికో తీసుకువెళ్ళమని రక్త సంబంధీకులే చెప్పారు. ‘మరి అక్కడ యెవరీమనిషికి కాపలా వుంటారు?’ అని అడిగితే గుటకలు వేశారు. మేం కాపలా వుండలేం తేల్చి చెప్పేశారు కుర్రాళ్ళు. కుక్కలో నక్కలో పీక్కుతింటే? అనుమానం. బేరాలకి లొంగలేదు కుర్రాళ్ళు.

‘ముందు యింట్లోంచి తీసుకెళ్ళి గుమ్మంలో పెట్టండి’ అని అయితే చెప్పారు. చెప్పిన యింటివాళ్ళు సాయానికీ చెయ్యి వెయ్యలేదు. అటు యిద్దరు కాళ్ళు పట్టుకుంటే, యిటు యిద్దరు చేతులు పట్టుకొని జాగ్రత్తగా తెచ్చి ఆ మనిషిని గుమ్మంలో పెట్టారు కుర్రాళ్ళు.

కుటుంబానికి కొంత వూపిరాడింది. ఎందుకంటే యింట్లో పోతే అరిష్టం. శాంతి చేసినా అశాంతే. రేపు పోని అద్దెకు యిచ్చినా తెలిసినవాళ్ళయితే యెవరూ దిగరు.

వీధిలో వాళ్ళు తలుపులు మూసుకున్నారు. ఇంట్లో చావచ్చు కదా, అందరినీ చంపకపోతే అనీ అనుకున్నారు. ఏదయితేనేం ఆ రోగం మనిషి చావుకోసం యింటా బయటా అంతా యెంతగానో యెదురు చూశారు. సిగ్గేసిందేమో చావు ముఖం చాటేసింది.

మొత్తానికి గుమ్మంలో మనిషి బతికాడు.

రోగికి తలంటారు. పంచ ద్రవ్యాలతో యిల్లు కడిగారు.

అంటురోగం యివన్నీ చూడలేకయేమో అదృశ్యమైపోయింది.

కాని రోగం అయితే యెప్పటిలాగే వుండిపోయింది, అందుకు సాక్ష్యంగా యెప్పటిలాగే కుర్రాళ్ళు గుమ్మంలో నిలబడి పండగకి కొత్త బట్టలు అందుకున్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *