మెరుపు మెరిసినట్టు
ఉరుము ఉరిమినట్టు
పదే పదే అదే కల
నిద్ర పోనివ్వని కల
ఎవరు ఏ కొలువులో ఉన్నా
ఏ వృత్తిలో ఉన్నా
ఢిల్లీ రాజు కయినా
డాలర్లు సంపాదించే కొడుకు కయినా
బంగారు బాతు కోసుకు తిన్నట్టు
పంట భూమి అమ్ముకు తిను సోమరి కయినా
వాని కంచంలో మెతుకయ్యే కల
కడుపు నిండి నోడికి
కడుపు ఎండినోడికి
ముద్దు ముద్దుగా గోరు ముద్దలు తినిపించినట్టు
పాలోనికయినా పగోడికయినా
చంపుతానని కత్తి పట్టుకుని వచ్చే వాడికయినా
వాని విస్తరాకులో అన్నపు రాశిలా
వెలిగిపోయే కల
బిడ్డ
ఆకలి ఆకలి అంటూ ఏడుస్తున్నట్టు
అన్నార్తుల ఆకలి పళ్ళెం
ఇంటిముందు డప్పయ్యి మోగుతున్నట్టు
ఒకటే కల
నిద్ర దుప్పటి లాగేసి
పైరు పాపల్ని ఆకాశానికి ఎగదోస్తూ
కాలాన్ని ముల్లుగర్రతో పొడుస్తూ
పంట చుట్టూ తిరుగుతున్న కల
చెంబెడు నీళ్ళు పోసిన పుణ్యానికి
అంతెత్తు మల్లె పందిరి
దోసెడు మల్లెలు అయినట్టు
రాత్రి పగలు చెమట కాలువలు తవ్వి
చీడ పీడలు ఏరి పారేసిన పంటకాపు సాయానికి
పంట తల్లి మురిసిపోయి
బువ్వ మెతుకులు కోసుకుపొమ్మని
ప్రేమగా మోకరిల్లుతున్న కల
కడుపు ఉన్న ప్రతి హృదయమూ
సాగిలపడిపోయే
వజ్రం లాంటి ఆ స్వప్నం ముందు
మన కలలు ఏపాటి
చదువుకున్న పిల్లలు
కొలువు కుదిరే పనిలో ఉన్నా
మెతుకు పంటకు జీవితం అంకితమయిన కల
ఎంత గొప్పోడయినా చిన్నబోయే కల.
చినుకు పడితే సంబరపడిపోయే కల
పంట కోతకొస్తే ఎగిరి గంతేసే కల
నీ నా స్వార్థం తలదించుకునే కల.




