’ఉస్మానియా’ పునరుద్ధరణలో సహకరించాలి

– ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5కు సీఎం రేవంత్ విజ్ఞప్తి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని, తమ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5తో ఆయన మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నామని, అగా ఖాన్ ఫౌండేషన్ కుతుబ్ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించిందని గుర్తు చేశారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్ భవనాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని అన్నారు. మూసీ నదిని నైట్ ఎకానమీ కోసం తీర్చిదిద్దుతామని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, తప్పక హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, .30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, నెట్-జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ ఉండబోతోందని, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల దూరంలో నిర్మిస్తున్నామని వివరించారు. సింగపూర్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *