– 17న పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవం
– ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : ఆనాడు నిజాం పెట్టిన బాధలను భరించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకునేందుకు భారత ప్రభుత్వం ‘హైదరాబాద్ ముక్తి దివస్‌ను ప్రారంభించిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ (హైదరాబాద్ ముక్తి దివస్) ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. కేంద్ర సాయుధ బలగాల కవాతు రిహార్సల్స్, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను వీక్షించిన అనంతరం భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్య్ర పండుగ చేసుకుంటుంటే ఆనాడు నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మనకు స్వాతంత్య్రం రాలేదని గుర్తు చేశారు. గ్రామగ్రామాన రజాకార్లు హిందువులపై దాడులు, దమనకాండ కొనసాగిస్తూ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దమనకాండ నుంచి తమను, గ్రామాన్ని కాపాడుకునేందుకు ప్రజలే స్వయంగా బురుజులు, రక్షణ గోడలు నిర్మించుకుని నిలబడ్డారని, ఆనాటి రక్త చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, గుర్తులు నేటికీ మన పల్లెల్లో సజీవంగా కనిపిస్తాయని గుర్తుచేశారు. విమోచన దినోత్సవం ఏ ఒక్కరికో సంబంధించిన కార్యక్రమం కాదని, గతంలో బీఆర్ఎస్ గానీ, ప్రస్తుత కాంగ్రెస్ గానీ మజ్లిస్ పార్టీకి భయపడి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను సైతం పక్కనపెట్టి ఈ చారిత్రక దినోత్సవాన్ని నిర్వహించకుండా తప్పించుకున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఈ ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఈసారి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సాయుధ దళాల విన్యాసాలతోపాటు తెలంగాణ కళాకారులతో కూడిన ఆకర్షణీయమైన నాట్య ప్రదర్శనలు, సంప్రదాయ డప్పుల విన్యాసాలు చారిత్రక పోరాటాలను కళ్లకు కట్టేలా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తోపాటు పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





