మన దేశంలో కులం మరియు మతం తమదైన పాత్రను పోషిస్తూ ఉంటాయి, ప్రజలు సైతం కులం మతం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కులాంతరాలు లేని సమసమాజాన్ని నిర్మాణం చేయాలనుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి రాష్ట్ర రాజకీయాలు మొత్తం దళితుల చుట్టూ తిరుగుతున్నాయి కాదు కాదు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా దళితుల చుట్టూ రాజకీయాలను తిప్పుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షలకు పైగా దళిత కుటుంబాలుండగా, 18% పైగా దళితులు ఓటు హక్కును కలిగి ఉన్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి దళితులను ఓటు బ్యాంకు గా మార్చుకోవడం కోసం రాష్ట్ర ప్రజల దేవాలయమైనటువంటి అసెంబ్లీ వేదికగా రాజకీయం చేస్తున్నారు. అయితే అదే అసెంబ్లీలో ఉన్న మిగతా పార్టీలు సైతం దళిత సమాజ అభ్యున్నతికి ఏనాడు గొప్పగా కృషి చేయలేదు.
సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల వేదికగా దళితుల ఆత్మగౌరవం మరొక సారి చర్చకు వచ్చింది. భారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నల్ల రంగు టీ షర్ట్లు ధరించి నిరసన తెలుపుతూ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న క్రమంలో భారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు నిలువరించిన సమయంలో బారాస ఎమ్మెల్సీలు తాతా మధు గారు మరియు నవీన్ రెడ్డి గారు మాట్లాడిన భాష అనేక వివాదాలకు దారితీసింది. ఆ భాష మరియు ఆ వ్యాఖ్యలు గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఉద్దేశించే అన్నారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తూ వచ్చింది మరియు గడ్డం ప్రసాద్ గారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుకనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు సభకు సైతం హాజరవ్వడం లేదు ఇది దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా అని కాంగ్రెస్ పార్టీ శాసనసభలో చర్చకు చర్చకు తెరలేపింది. ఈ అవమానం కేవలం గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మాత్రమే జరిగింది కాదు మొత్తం దళిత సమాజానికి జరిగిన అవమానంగా చిత్రీకరించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని భావించవచ్చు.
అయితే గౌరవ స్పీకర్ గారిని అవమానించారనే నెపంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న దళిత సమాజం డప్పు కొట్టుకుంటూ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ర్యాలీగా వెళ్లడం, తదనంతరం భారాస శ్రేణులు సంవత్సరాల కిందటి అస్పృశ్యత ఆనవాళ్ళను మళ్లీ దళిత సమాజానికి గుర్తు చేసే విధంగా దళితులు నదియాదిన నేలను పసుపు నీరు చల్లి శుద్ధిచేసి దళిత సమాజం ను అవమానపరిచారు.
అయితే పసుపు నీళ్ల రాజకీయం మొదలు పెట్టిందే కాంగ్రెస్, గతంలో ఇదే కాంగ్రెస్, జిహెచ్ఎంసి కార్యాలయంలో పసుపు నీళ్లు చల్లి, రాష్ట్ర రాజకీయాల్లో పిచ్చి సాంప్రదాయాలను ప్రారంభించింది. అయితే నేడు భారాస అదే సాంప్రదాయాన్ని కొనసాగించడం కొసమెరుపు. అయితే ఈ పసుపు నీళ్ల రాజకీయం కు బీజేపీ కూడా అతీతమేమి కాదు. బీజేపీ కార్యకర్తలు సైతం ఈ మధ్య నే మల్లికార్జున ఖర్గే గారు రామ్ లీలా మైదానంలో ఉపన్యసించి వెళ్ళగానే ఆ సభా ప్రాంగణం పై పసుపు నీళ్లను చల్లి దళిత సమాజానికి గత చేదు అనుభవాలను గుర్తు చేశారు. గతం లో సైతం బీజేపీకి సంబంధించిన ఒక రాజస్థాన్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా, దళిత వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాముని గుడిలోకి వెళితే ఆ గుడిని గంగాజలంతో శుద్ధిచేసి దళిత నేతను అవమానించారు. పసుపు నీళ్ల రాజకీయంతో రాజకీయ పార్టీలు తమ నిరసనలు తెలుపుతున్నట్లు భావిస్తున్నప్పటికీ ఈ పసుపు నీళ్ల రాజకీయం మాత్రం దళిత సమాజాన్ని అవమానాలను అవహేళనలను గుర్తు చేస్తుంది, ఆనాటి అస్పృశ్యత ను అంటరానితనంను గుర్తు చేయడానికి కాంగ్రెస్, బీజేపీ, భారాసలు ప్రయత్నం చేస్తున్నట్లుగా దళిత సమాజం భావిస్తుంది.
అయితే రాష్ట్రం లో దళితుల ఆత్మ గౌరవం పై కపట ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ దళితులను అంతలా గౌరవిస్తుందా అంటే గౌరవించదు అని బల్లగుద్ది చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన క్యాబినెట్ లో తన సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రుల శాఖల్లో లక్షల కోట్ల అవినీతి జరిగినా స్పందించడు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజానేత అయిన భట్టి విక్రమార్క గారి ఎదుగుదలను చూసి తట్టుకోలేక, భట్టి విక్రమార్క గారి శాఖలలో చిన్న తప్పిదాలు జరిగిన లక్షల కోట్ల అవినీతి అక్రమాలు జరిగినట్టు రేవంత్ రెడ్డి గారి అనుకూల పత్రికలు, మీడియా ఛానల్లో కథనాలు ప్రదర్శించి అవమానించడాన్ని దళిత సమాజం గమనిస్తుంది. నాటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సైతం సాక్షాత్తు డా.. బి.ఆర్ అంబేద్కర్ గారిని తమ ఇంట్లో వ్యక్తిని అంబేడ్కర్ గారికి వ్యతిరేకంగా నిలబెట్టి 1952, 1954 ఎన్నికల్లో ఓడించిన సంఘటనను దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోదు.
అంతేకాకుండా పార్టీ అధ్యక్ష పదవుల నియామకాల విషయాలలో సైతం కాంగ్రెస్, భారాస, బీజేపీ దళిత వర్గాలకు పెద్దపీట వేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30%కు పైగా జనాభా ఉన్న దళిత సామాజిక వర్గానికి మూడు ప్రధాన పార్టీల్లో వచ్చిన అవకాశాలు తక్కువే,ఒక అంకె సంఖ్య కూడా దాటదు అనేది ఎవరు కాదనలేని నిజం, 70 సంవత్సరాల కాంగ్రెస్ లో తెలుగు రాష్ట్రాలకు పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు వరకు ఒక్క దళితుడే నియామకం కావడం, భారాస లో లేదు, బీజేపీ లో సైతం ఒక్కరంటే ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఎదగలేదు. ఒకే ఒక్క వ్యక్తి దళితుల నుండి జాతీయ అధ్యక్షుడు వరకు ఎదిగితే అతన్ని సైతం కేవలం లక్ష రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపణల క్రమంలో పదవి నుంచి తొలగించారు, మిగతా అధ్యక్షుల విషయంలో ఇలా అనుసరించలేదు. ఇలా బీజేపీ సైతం దళిత సమాజాన్ని తక్కువ చూపు చూస్తూనే ఉందనే అభిప్రాయం దళిత సమాజం లో నాటుకుపోయింది.
దళిత సమాజాన్ని అవమానించడంలో భారాస తక్కువ ఏమి కాదు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని దళిత బంధు అని అనేక హామీలు ఇచ్చి నేటి భారాసను నాటి తెరాసను దళితులు ఓట్లేసి గెలిపించి పట్టం కట్టారు. కేసీఆర్ గారు దళితులను ముఖ్యమంత్రి చేయకపోగా మూడెకరాల భూమి విషయంలో మరియు రాష్ట్రమంతా దళిత బందును ఇస్తామని చెప్పి దళితులకు పంగనామాలు పెట్టిన విషయాన్ని దళితులెప్పటికి మర్చిపోరు. ఎంతో కొంత అమలయిన దళిత బంధు పథకం కేవలం బారాస కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు కమిషన్ పొందడానికి ఉపయోగపడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాక్షాత్తు అనేక సందర్భాల్లో అంబేద్కర్ గారి జయంతులు వర్ధంతిలకు సైతం కేసీఆర్ గారు హాజరు కాకపోవడం దళితులు మర్చిపోలేని నిజం. భారాస కు సంబంధించిన దళిత వర్గానికి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కు, తెలంగాణ ఆటపాటకు ప్రతీకగా నిలిచిన సాయిచంద్ గారిరువురు మరణించినప్పుడు అధికారిక లాంఛాలనాలతో అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని కేసీఆర్ ప్రభుత్వం అగ్ర వర్ణాలకు చెందిన ఆంధ్ర నాయకుల పుత్రుల కు అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు చేయడం తో దళితులకు కేసీఆర్ గారు తన పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం ఏంటనేది తేటతెల్లం అయ్యింది. ఇలా దళితులపై కేసీఆర్ గారికి, నాటి తెరాస ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి ఏంటనేది దళితులకు అవగతమయింది.
అయితే బారాస,కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లో పరిస్థితి ఇలా ఉంటే స్వాతంత్ర ఉద్యమం నుండి దేశంలో మా వంతు పాత్ర పోషిస్తున్నామని చెప్పిన కమ్యూనిస్టుల పరిస్థితి మరింత భిన్నంగా ఉంది.వీరు దళిత సాధికారత కోసం చేసిన ప్రయత్నం ఏమీ లేదు, నేటికి ఒక్కరంటే ఒక్క దళితుడిని కూడా కేంద్ర కమిటీలోకి తీసుకొని చరిత్ర కమ్యూనిస్టులది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కమ్యూనిస్టులను కామ్రేడ్లు అనగా ఖమ్మం కమ్మ వారు నల్లగొండ రెడ్లు గా అభివర్ణిస్తారు.కమ్యూనిస్టులు దళితులను అభ్యున్నతి వైపు తీసుకువెళ్లడంలో ఒరగపెట్టిందేం లేదు. దళితుల వల్ల దళిత కాలనీల వల్ల కమ్యూనిస్టులు లాభపడ్డారే కానీ దళిత సమాజం కు కమ్యూనిస్టుల వల్ల ఏ ఉపయోగం కలగలేదు. తెలంగాణ మొదలు జాతీయ స్థాయి వరకు తమ కార్యవర్గాల్లో అగ్రవర్ణాలకే ప్రాధాన్యం దక్కింది తప్పితే దళిత వర్గాలకు చోటివ్వలేదు.
దళితులు తమ శక్తి వంచన లేకుండా పార్టీల కోసం పని చేసినా, వారు కేవలం పల్లకి లు మోసే జెండా కూలీలుగానే మిగిలారు, గతంలో గర్భగుడి లోకి రానివ్వలేదు అన్న చందంగా రాజకీయ పార్టీలు సైతం దళిత కార్యకర్తలను ఓ స్థాయి వరకే అవకాశాలు కల్పించారు. దళిత కార్యకర్తలు కేవలం పోలీస్ కేసులు పెట్టుకోడానికి, వ్యతిరేక పార్టీలోని అగ్రవర్ణ నాయకులకు వ్యతిరేకంగా పని చేయడానికి, తమ పార్టీలను వేరే పార్టీల అగ్రవర్ణాల నాయకులు అవహేళన చేసినప్పుడు మాత్రమే దళితులను ముందు పెట్టీ పార్టీలు రాజకీయం చేశాయి. ఇలా పార్టీ ల మనుగడ కొరకు దళితుల ఆత్మగౌరవాన్ని చర్చకు తీసుకు వస్తున్నారు, ఇకనైనా దళిత సమాజం ఈ రాజకీయ పార్టీల చిల్లర రాజకీయం గమనిస్తూ, పార్టీల వల లో పడకుండా దళిత సమాజంలోని ప్రముఖులు తక్కిన దళిత సమాజాన్నికి అవగాహన కల్పిస్తూ వారిని సాధికారతవైపు తీసుకువెళ్లేలా కృషి చేయాలి. ఎప్పటికప్పుడు ఒక కొత్త ఎత్తుగడతో దళిత సమాజాన్ని ఓటు హక్కుగా మలుచుకునే కుట్రలు చేస్తున్న రాజకీయ పార్టీలను గమనిస్తూ వారి రహస్య ఎజెండాలో పడకుండా దళిత యువత ఆచితూచి సంయమనంతో ఆలోచనలు చేస్తూ క్రియాశీల రాజకీయాల్లో మనదైన పాత్ర పోషించాలి.
వ్యాసకర్త
జవ్వాజి దిలీప్, పరిశోధక విద్యార్థి,
దళిత సామాజిక కార్యకర్త.
7801009838.





