దిల్లీ ప్రజలను మోసం చేయాలని కుట్ర

అమలు కానీ హామీలపై దిల్లీలో పచ్చి అబద్ధాలు
మాజీ మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18 :  ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రచారం చేస్తూ  పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలాగైతే మోసం చేశారో అలాగే దిల్లీ ప్రజలను కూడా మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వొచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.  నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఉద్యోగులు, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక వెతలు పడుతున్నారని హరీష్‌ ‌రావు తెలిపారు.

ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఏపీఓలు ఇలా వేల మంది చిరు ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్న దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నారని తెలిపారు.

కండ్లు కాయలు కాసేలా జీతాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కుర్చీ కాపాడుకోవడం కోసం దిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డబ్బా ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *