– గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ‘ఉపాధి’ పథకం
– వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ విలేజ్.. వర్క్ ఫర్ విలేజ్
– తొలిసారిగా 12 వేల మందికి పైగా సర్పంచులతో మంత్రి సీతక్క వీసీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు నిరంతరం ఉపాధి కల్పించడంతో పాటు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అధికారులను, సర్పంచులను ఆదేశించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 12 వేల మందికి పైగా సర్పంచులు, సీఈవోలు, డీఆర్డీవోలు, మండల, జిల్లా అధికారులతో సచివాలయం నుంచి ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ కూలీల ఆదాయం, వ్యవసాయం, భూగర్భ జలాలు, పశుగ్రాసంపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఉపాధి హామీ పనులను కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమంగానే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కల్పించేలా, నీటి వనరులను పెంపొందించేలా అమలు చేయాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ విలేజ్.. వర్క్ ఫర్ విలేజ్ అనే స్ఫూర్తితో సర్పంచులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు. మన ఊరు-మనమే బాగు చేసుకోవాలన్న స్ఫూర్తితో సర్పంచ్ గ్రామ అభివృద్ధికి కథానాయకుడిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులను వినియోగించకపోతే భవిష్యత్తులో నిధుల కేటాయింపుపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
రోజుకు కనీసం 6 లక్షల మందికి ఉపాధి
ప్రతి గ్రామ పంచాయతీలో రోజూ కనీసం 100 నుంచి 150 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. కూలీలకు నిరంతరం పని లభించేలా ముందుగానే పనులను గుర్తించి, అంచనాలు సిద్ధం చేయాలి. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, రోజుకు రూ. 308 వేతనం అందేలా ఉత్పాదక పనులను ప్రణాళిక చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ కనీసం 6 లక్షల మందికి పని కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, గ్రామంలో 18 ఏళ్లు నిండిన అర్హులైన కుటుంబ సభ్యులకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట.. ప్రతి ఊరికి ఊట కుంట” అనే లక్ష్యంతో నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, సోక్‌పిట్స్, కందకాలు, చెక్‌డ్యామ్‌లు, రాతి కట్టల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు.
గ్రామ సభల నిర్ణయాలకే ప్రాధాన్యత
అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యంతో పనులకు ఆమోదం తీసుకోవాలన్నారు. 2026 అక్టోబర్ నుంచి 2027 జూన్ వరకు చేపట్టాల్సిన పనులను ముందుగానే సిద్ధం చేయాలి. ప్రతి పంచాయతీకి సుమారు రూ. 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉపాధి నిధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని గ్రామాల అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పక్షపాతంతో కొన్ని జిల్లాలకే నిధులు కేటాయించారని, తమ ప్రభుత్వం జనాభా, స్థానిక అవసరాల ప్రాతిపదికన అన్ని జిల్లాలకు సమన్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయకుండా మట్టి, మొరం రోడ్లు నిర్మించాలన్నారు.
నవంబర్ 19లోపు వీవో భవనాల పూర్తి
రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 204.50 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. వాటితో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, వీవో (V.O) భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీవో భవనాలను నవంబర్ 19 లోపు పూర్తి చేయాలని, ప్రతి మహిళా సంఘం భవనం వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద కమ్యూనిటీ శానిటరీ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సాంకేతిక, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





