– హిందూ సమాజాన్ని విభజించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
– బేషరతుగా క్షమాపణ చెప్పాలి
– సీఎం వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మండల కేంద్రాల్లో బీజేపీ నిరసనలు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : ఓటమి భయంతో రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. రాముడు, శివుడిని వేరు చేస్తూ సమాజాన్ని చీల్చాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు బీజేపీ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు పార్టీలో చేరగా వారిని సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల బ్రిస్బేన్(ఆస్ట్రేలియా)లో ఇండియన్ కల్చరల్ సొసైటీ ఆహ్వానం మేరకు పర్యటించి వచ్చిన రామచందర్ రావును పార్టీ నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ఎన్నికల ప్రక్రియను అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలే ప్రశంసిస్తూ, అధ్యయనం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యవస్థను, ప్రతిష్ఠను ప్రపంచ వేదికలపై కించపరుస్తోందని మండిపడ్డారు.
‘సర్’పై కాంగ్రెస్ నేతల ద్వంద్వ ప్రమాణాలు
దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన, దొంగ ఓట్ల తొలగింపు, అసలైన ఓటర్లకు న్యాయం చేయడమే ఎసఐఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో 2018లో తెలంగాణ, రాజస్థాన్‌లలో ఓట్ల తొలగింపుపై అభిషేక్ మను సింఘ్వి, సచిన్ పైలట్, పశ్చిమ బెంగాల్లో జవహర్ సిర్కార్ వంటి కాంగ్రెస్, కూటమి నేతలే వేలాది దొంగ ఓట్లు ఉన్నాయని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేరళం ఎన్నికల్లో సర్’ ప్రక్రియ సక్రమంగా జరగడం వల్లే తమకు ప్రయోజనం కలిగిందని కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల సైతం స్వయంగా అంగీకరించారని తెలిపారు.
ఈసీఐ న్యూట్రాలిటీపై తప్పుడు ప్రచారం
ఎన్నికల సంఘం సభ్యుల మధ్య విభేదాలున్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని రామచందర్ రావు తిప్పికొట్టారు. ఈసీఐ సభ్యుల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, పరిపాలనాపరమైన స్పష్టత కోసమే నోట్ రాశారని ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సంయుక్తంగా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో సుకుమార్ సేన్, కల్యాణ్ సుందరం, ఎస్పీ సేన్ వర్మ, నాగేంద్ర సింగ్, టి.స్వామినాథన్, ఆర్.కె.త్రివేది వంటి కమిషనర్లకు పదవీ విరమణ తర్వాత పదవులు, పద్మ పురస్కారాలు, గవర్నర్గిరీలు ఇచ్చి రాజ్యాంగ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. ప్రధాని మోదీ హయాంలో పారదర్శకమైన ఎంపిక ప్రక్రియతో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.
హిందూ దేవుళ్లను విభజిస్తున్న రేవంత్ క్షమాపణ చెప్పాలి
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను వాడుకుంటూ సమాజాన్ని నిలువునా చీల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరితెగించారని రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ‘పేదవాడైనా, ధనికుడైనా ఏ కష్టమొచ్చినా రాముడిని, కృష్ణుడిని, శివుడిని, దేవుళ్లందరినీ స్మరిస్తామని గుర్తుచేశారు. భూముల అమ్మకాలు, భూదందాలతో వేల కోట్లు వెనకేసుకుంటున్న రేవంత్ రెడ్డికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి.. ఆయనకు ఎలాంటి కష్టాలూ లేవు కాబట్టే దేవుళ్లపై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’ అని రామచందర్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానించడం ఇదే మొదటిసారి కాదన్నారు.
రేవంత్ రెడ్డి ‘రేవంతుద్దీన్’ అయ్యారు
రాహుల్, సోనియాలకు నెలవారీ ముడుపులు పంపిస్తూ వారి కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి ఈ విద్వేష ప్రచారానికి ఒడిగడుతున్నారని చెప్పారు. గతంలో స్వయంగా ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని బహిరంగంగా ప్రకటించిన రేవంత్ ఇప్పుడు కల్మాలు చదువుకుంటూ ‘రేవంతుద్దీన్’గా మారిపోయారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తర-దక్షిణ బేధాలు, కులాల చిచ్చులు పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా హిందూ దేవుళ్ల మధ్య వైషమ్యాలు రగిల్చే స్థాయికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోట్లమంది హిందువుల మనోభావాలను గాయపరచడమేనన్నారు. రాముడు, శివుడు ఒకటేనన్న కనీస సాంస్కృతిక స్పృహ, ఇంగితజ్ఞానం ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. రేవంత్ రెడ్డికి దేవుళ్లపై నమ్మకం లేకపోతే ఇంట్లో కూర్చోవాలి తప్ప అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు దైవాలను కించపరిచే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసమే హిందూ వ్యతిరేక కుట్రలు
త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్లను పొందేందుకే రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై విషం చిమ్ముతున్నారని రామచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరిగాయని దుయ్యబట్టారు. ఒకవైపు వక్ఫ్ బోర్డు భూములను అక్కున చేర్చుకుంటూ మరోవైపు దేవాదాయ శాఖ భూములను యథేచ్ఛగా అమ్ముకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈరోజు బీజేపీలో చేరిన ప్రముఖ వైద్యులు, మానసిక నిపుణుల బృందాన్ని సీఎం వద్దకు పంపి ఆయనకు కౌన్సెలింగ్, చికిత్స ఇప్పించాల్సిన అవసరం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేవుళ్లపై నమ్మకం లేని, హిందూ సమాజాన్ని అవమానించే నాయకుల ఫ్లెక్సీలను ఇకపై ఏ ఆలయం ముందూ పెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. సీఎం వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బుధవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు రామచందర్ రావు ప్రకటించారు. సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జ్ ఎన్.వి.సుభాష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్ట్‌లు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో డాక్టర్ల చేరిక
ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతి శర్మ, డాక్టర్ సుభాష్, డాక్టర్ రణ్వీర్ సింగ్ జీ, డాక్టర్ జీవిత రవిపాటి, డాక్టర్ పమేలా, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ శ్రీ నగేష్, డాక్టర్ హనుమంతరావు, తదితరులు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి రామచందర్‌రావు సాదరంగా ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





