– ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి
– మహిళలకు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : మహిళలు ఏ కారణంతోనైనా తమ చదువును మధ్యలో ఆపేసి ఉంటే మళ్లీ చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళలను ఆర్థికంగా మాత్రమేకాక విద్య, నైపుణ్య రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తన జీవితమే ఇందుకు ఉదాహరణ అని, వివిధ కారణాలతో నిలిచిపోయిన తన చదువును తిరిగి కొనసాగించకపోయి ఉంటే నేడు ఈ స్థాయిలో ఉండే అవకాశం ఉండేది కాదని ఆమె అన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి దగ్గర నుంచే 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కుటుంబ బాధ్యతలు, పనులు చూసుకుంటూనే మహిళలు చదువును కొనసాగించవచ్చని చెప్పారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా లక్షలాది మంది మహిళలు చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్చుకున్నారని, వారిలో అనేక మంది ఉల్లాస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అక్షరాస్యత సాధించిన మహిళలకు ఇకపై 10వ తరగతి పరీక్షలు రాసే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మహిళలు చదువుకుంటే వారికి మరిన్ని ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.. విద్య మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.. అందుకే అక్కచెల్లెమ్మలంతా 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ముందుకు రావాలి అని మంత్రి పిలుపునిచ్చారు. దగ్గరలోని మీ సేవా కేంద్రాలు, ‘టాస్’ కేంద్రాలు లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం ప్రతి మండలం నుంచి కనీసం వందమంది మహిళలు 10వ తరగతి పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను మంత్రి కోరారు.‘ áదువుకు వయసుతో సంబంధం లేదు.. 14 ఏళ్లైనా, 40 ఏళ్లైనా చదువును కొనసాగించవచ్చు.. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతీ మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు.. ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగించవచ్చు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చదువును పూర్తి చేసుకోండి.. మీ చదువు మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అని మంత్రి సీతక్క అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు
‘





