– వారి నైపుణ్యంతో ప్రాజెక్టుల పునరుద్ధరణ మరింత పటిష్ఠం
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్ఎల్బీసీ) సొరంగం నిర్మాణాన్ని వేగవంతం చేయడంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను మరింత పటిష్ఠంగా చేపట్టేందుకు భారత సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అదనపు అధికారుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్‌లోని మిలిటరీ సెక్రటరీ విభాగం ప్రభుత్వ ఎంపిక కోసం ముగ్గురు ఆర్మీ అధికారుల పేర్లను పంపింది. వారిలో లెఫ్టినెంట్ కల్నల్ సత్యదేవ్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ ఎ.మీనన్, లెఫ్టినెంట్ కల్నల్ హెచ్.వి.భల్లా ఉన్నారు. అత్యంత సంక్లిష్టమైన సాగునీటి ప్రాజెక్టుల్లో వీరి సేవలను వినియోగించుకునేందుకు ముగ్గురినీ డిప్యుటేషన్‌పై తీసుకోవడాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల దిల్లీలో భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేథ్‌ను కలిశారు. ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల ప్రాధాన్యాన్ని వివరించి, అనుభవజ్ఞులైన ఆర్మీ ఇంజినీరింగ్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆ ప్రతిపాదన వేగంగా ముందుకు సాగి ప్రభుత్వ పరిశీలన కోసం ముగ్గురు ఆర్మీ అధికారుల పేర్లను ఆర్మీ ప్రధాన కార్యాలయం పంపింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనరల్ ధీరజ్ సేథ్ ఇద్దరూ పుణె సమీపంలోని ఖడక్వాస్లాలో ఉన్న ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) పూర్వ విద్యార్థులు కావడంతో వారిద్దరి మధ్య సంస్థాగత అనుబంధం, పరిచయం ఉన్నాయి. ఉత్తమ్ ఎన్డీఏలో వైమానిక దళ విభాగంలో శిక్షణ పొంది అనంతరం భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా సేవలందించారు. జనరల్ ధీరజ్ సేథ్ ఆర్మీ విభాగంలో శిక్షణ పొంది ఆర్మ్‌ర్డ్ కార్ప్స్లో నియమితులయ్యారు. ఆయన 2026 జూన్ 30న భారత సైన్యానికి 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సాయుధ దళాల సామర్థ్యంపై అత్యున్నత గౌరవం
ఒక మాజీ సైనిక అధికారిగా భారత సాయుధ దళాల అధికారుల వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, నిజాయతీ, క్రమశిక్షణ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యంపై తనకు అత్యున్నత గౌరవం ఉంది.. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో, విపత్తుల సమయంలో, తీవ్రమైన సవాళ్లు ఎదురైన సందర్భాల్లో కూడా సమర్థవంతంగా పనిచేసేలా సైనిక అధికారులకు శిక్షణ ఇస్తారు. సాంకేతిక నైపుణ్యంతోపాటు నాయకత్వం, జవాబుదారీతనం, లక్ష్యసాధన దృక్పథం వారి ప్రత్యేకత అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంతో సుమారు రెండేళ్లుగా డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న కల్నల్ పరీక్షిత్ మెహ్రా సేవలతో కలిగిన అసాధారణ అనుభవం కూడా మరికొందరు ఆర్మీ అధికారుల సేవలను తీసుకోవాలనే నిర్ణయానికి ప్రధాన కారణమని మంత్రి తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ ప్రణాళికలతో కల్నల్ పరీక్షిత్ మెహ్రా సన్నిహితంగా పనిచేస్తున్నారు. ఆయన సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, అత్యంత సంక్లిష్టమైన పనులను సమన్వయం చేసే సామర్థ్యం నీటిపారుదల శాఖకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి పనిచేసిన అనుభవం అసాధారణమైనది.. సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుభవజ్ఞులైన సైనిక ఇంజినీర్లు ఎంతటి విలువను జోడించగలరో ఆయన సేవలు నిరూపించాయి.. ఆ అనుభవంతోనే మరికొందరు అధికారులను డెప్యుటేషన్‌పై పంపాలని ఆర్మీ చీఫ్‌ను కోరాం.. మా విజ్ఞప్తికి జనరల్ ధీరజ్ సేథ్, ఆర్మీ ప్రధాన కార్యాలయం అత్యంత సానుకూలంగా, వేగంగా స్పందించినందుకు కృతజ్ఞతలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న కార్యాచరణ ప్రకారం ముగ్గురు అధికారుల్లో ఒకరిని ఎస్ఎల్బీసీ సొరంగం రెండు వైపులా జరుగుతున్న తవ్వకం పనుల పర్యవేక్షణకు నియమించనున్నారు. సొరంగం లోపల తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాలకు సమీపంలో చేపట్టే కార్యకలాపాలను కూడా ఆయన నిరంతరం పర్యవేక్షిస్తారు. మిగిలిన ఇద్దరు అధికారులను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగం దేశంలోనే అత్యంత పొడవైన, సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన సాగునీటి సొరంగ ప్రాజెక్టులలో ఒకటి. సుమారు 44 కి.మీ పొడవైన ఈ సొరంగంలో ఇప్పటికే దాదాపు 35 కి.మీ పని పూర్తయింది. మిగిలిన పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అధునాతన భూభౌతిక పరిశోధనలు, మరింత పటిష్ఠమైన వెంటిలేషన్, భద్రతా వ్యవస్థలు, పనుల నిరంతర నమోదు, క్షేత్రస్థాయిలో కఠినమైన పర్యవేక్షణతో పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను శాస్త్రీయంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సూచించిన మట్టి, కాంక్రీట్, పునాదులకు సంబంధించిన పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఐఐటీ బాంబే, ఏఎ ఫ్ఆర్వై ఇండియా సంస్థలు పరీక్షల ఫలితాలను విశ్లేషించి, అవసరమైన నిర్మాణాత్మక పునరుద్ధరణ చర్యల కోసం తుది డిజైన్లను సిద్ధం చేస్తున్నాయి. గడువులో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేయడంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తి భద్రతతో తిరిగి పనిచేసే స్థితికి తీసుకురావడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఉత్తమ్ స్పష్టం చేశారు. పనుల వేగం కోసం కార్మికుల భద్రత, ఇంజినీరింగ్ ప్రమాణాలు లేదా నిర్మాణాల దీర్ఘకాలిక స్థిరత్వం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనిక నేపథ్యం, సాయుధ దళాల వ్యవస్థలపై ఆయనకున్న అవగాహన, ఎన్డీఏతో ఉన్న సంస్థాగత అనుబంధం, రక్షణ రంగంలోని వృత్తిపరమైన పరిచయాలు-రాష్ట్రంలోని అత్యంత క్లిష్టమైన మౌలిక సదుపాయాల పనులకు ప్రత్యేక నైపుణ్యాన్ని సమకూర్చుకోవడంలో ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు