అనేక ఆటుపోట్ల మధ్య కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి

 (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
అనేక ఆటుపోట్లమధ్య కాంగ్రెస్‌ ఏడాదిపాలనను పూర్తిచేసుకుంది. ఈ ఏడాదిలో స్వీయ, ప్రతిపక్షపార్టీల సహాయనిరాకరణ, అసమ్మతి సెగలు, నిరసనలు, సవాళ్ళు, ఛార్జిషీట్లనెన్నిటినో ఈ ప్రభుత్వం ఎదుర్కుని ధైర్యంగా నిలబడిరది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా అభ్యున్నతి, రాష్ట్ర ప్రగతిపైనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అధికారంలోకి రావడానికి ఎంత శ్రమించాల్సి వొచ్చిందో, అధికారం చేపట్టి, పాలనను దారిలోపెట్టేందుకు అంతకన్నా ఎక్కువ శ్రమపడాల్సివొచ్చింది. రోజుకు కనీసం పద్దెనిమిది గంటలు పనిచేసినా సమయం సరిపోవడంలేదు. సంవత్సరకాలంలో ఒక్కరోజుకూడా సెలవుతీసుకోకుండా కష్టపడుతున్న విషయాన్ని ఇటీవల సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలియందికాదు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టే విషయం దగ్గరినుంచి, స్వీయపార్టీలోని అసమ్మతిని సమ్మతిగా చేసుకునేందుకు సిఎంగా రేవంత్‌ ఎంతో చతురతను ప్రదర్శించాల్సి వొచ్చింది.పార్టీలో సీనియర్‌, జూనియర్‌ల తగాదా ఒకవైపు, మరోపార్టీనుండి వలస వొచ్చిన వారికి  పదవులు, ప్రాధాన్యత ఇస్తున్నారన్న అపవాదలనన్నిటినీ అధిగమించి ఈ ఏడా`ది కాలంలో వారందరిని తనవారిగా మార్చుకోవడంలో ఆయన నేర్పరితనం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్‌ అంటేనే సహజంగా గ్రూపు రాజకీయాలు, నిరంతర అసమ్మతి, కుమ్ములాటలు ఉంటాయంటారు.

కాని, ఈ ఏడాదికాలంలో రేవంత్‌రెడ్డి అటు అధిష్టానాన్ని, ఇటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పాతకాలపు లీడర్లను కూడా తనదారికి తెచ్చుకోగలిగారు. సిఎం పదవి చేపట్టినవెంటనే ఎలాంటి బేషజాలకు పోకుండా సీనియర్‌ నాయకుల ఇండ్లకు వెళ్ళి పాలనలో తనకు సహకారాన్ని అందించాల్సిందిగా వినమ్రంగా విజ్ఞప్తిచేయడం నిజంగా ఆయనకే చెల్లింది. సహజంగా కాంగ్రెస్‌లో సిఎం పదవిని ఆశించి భంగపడినవారిని ఓదార్చే క్రమంలో వారికి అధిష్టానం పిసీసీ పదవిని కట్టబెట్టడంద్వారా ఆవాంతరాన్ని దాటవేసేది. కాని ఆ ప్రయోగం తాత్కాలికమే అన్నట్లు తరుచు పీసీసీ, సిఎంల మధ్య ఉప్పులో నిప్పులా ఉంటూనే ఉండేది. దానివల్ల సిఎం నిర్ణయాలకు తరుచు ఆటంకాలు ఏర్పడుతుండేవి. ఇలాంటి పరిస్థితిరాకుండా పిసీసీ అధ్యక్షుడిని తనకు నచ్చినవారిని తీసుకునే విషయంలో అధిష్టానాన్ని ఒప్పించి, మెప్పించిన నేర్పరిగా నిలిచారు రేవంత్‌రెడ్డి. తోటిమంత్రులతోకూడా ఎలాంటి పొరపొచ్చాలు రాకూడదన్న ఉద్దేశ్యంగా ఆయన ఎన్నడూ ఇతర మంత్రిత్వశాఖల్లో జోక్యం తీసుకోకుండా, విధాన నిర్ణయంలో సంబంధిత మంత్రులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంవల్ల మంత్రులు కూడా సంతోషంగా తమ కార్యకలాపాల్లో నిమగ్నులవుతున్నారు. ఫలితంగా ఆయన ప్రజాసంక్షేమంపైన దృష్టిని కేంద్రీకరించే సమయం లభ్యమైంది.

image.png

ఆరంభంలో ఆర్థిక ఇబ్బందులున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో మరిన్ని అప్పులు చేయాల్సి
వొచ్చినప్పటికీ, ఆర్థిక క్రమశిక్షణను పాటించడంద్వారా ఇబ్బందులను అధిగమిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీమేరకు ఒకే విడుతలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అందజేయడంద్వారా దేశంలోనే రికార్డును నెలకొల్పిన ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. దానికితోడు సన్న వడ్లకు అదనంగా అయిదు వందల రూపాయల బోనస్‌ను ప్రకటించడం, వ్యవసాయరంగానికి ఉచితంగా 24 గంటల విద్యుత్‌ను అందజేయడంవల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల మెప్పును పొందుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కొంత వివాదగ్రస్తమైనప్పటికీ ఉద్యోగ కల్పన కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరుగడం ఆ ప్రభుత్వానికి గర్వకారణంగా మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శిక్షణపొందేందుకు స్కిల్‌ యూనివర్శిటీలద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించే సరికొత్తచర్యకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కలిగించడం ఒకటైతే, కోటి మంది మహిళను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంగా మహిళా సహాయక సంఘాలను పారిశ్రామికులుగా తీర్చిదిద్దేందుకు గతంలో ఎవరూ చేప్టని విధంగా చర్యలు చేపట్టడం అభినందనీయం. ధరణిలో లోపాలను సవరించి, రైతులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా దాన్ని ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలు, డ్రగ్స్‌ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతోపాటు వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలులో రేవంత్‌రెడ్డి ఈ ఏడాదికాలంలో తనదైన మార్క్‌ను చూపించుకున్నారనడంలో అతిశయోక్తిలేదు. చివరగా నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పడంలోనైతేనేమీ, ఆ కార్యక్రమానికి విపక్షపార్టీల నాయకులను సగౌరవంగా ఆహ్వానించే విషయంలో నైతేనేమీ ఎక్కడ మర్యాదకు భంగంవాటిల్లకుండా జాగ్రత్త పడ్డారు. అన్నిటికి మించి దశాబ్దకాలంగా తెలంగాణ మరిచిన రాష్ట్రగీతాన్ని ఆమోదించడంద్వారా రాష్ట్ర స్వాభిమానాన్ని మరింతగా ఆయన ప్రోత్సహించినట్లు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *