– భూదోపిడీలో ఆధారాలున్నా అరెస్టులు ఎందుకు చేయరు?
– ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల భూదోపిడీని ప్రస్తావించడం కేవలం కాంగ్రెస్ అధిష్టానానికి నిధులు పంపే ‘ఓపెన్ డీల్’ కోసమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం విచారణ కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే దోషులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజయ్ కార్యకర్తలతో కలిసి దీపం వెలిగించి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల భూదోపిడీపై సీఎం వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మళ్లీ సిట్, విచారణ కమిషన్లు అని జాప్యం చేయడం ఎందుకు.. రాబోయే ఎన్నికల కోసం ఏఐసీసీకి కప్పం కట్టడానికే బీఆర్ఎస్‌కు సీఎం ఓపెన్ ఆఫర్ ఇచ్చి డీల్ స్టార్ట్ చేశారు… నిజంగా ఆధారాలు ఉంటే తక్షణమే భూదోపిడీదారులను అరెస్ట్ చేసే అధికారముంది కదా అని ప్రశ్నించారు.
కేసీఆర్, కేటీఆర్‌ల నేపథ్యంపై తీవ్ర విమర్శలు
కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల యజమాని అన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు కేసీఆర్ పుట్టుకతోనే భూస్వామి అయితే 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఎకరం భూమి కూడా లేదని ఎలక్షన్ కమిషన్‌కు ఎందుకు సమర్పించారో చెప్పాలి. యువజన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు దొంగ పాస్‌పోర్టుల దందా కేసుల్లో సస్పెన్షన్‌ను తప్పించుకోవడానికే కేసీఆర్ రాత్రికి రాత్రే టీడీపీలో చేరారు. కేటీఆర్ అసలు పేరు ‘అజయ్ రావు’ అని, ఆనాడు ఎన్టీఆర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసమే ఆయన పేరును ‘తారక రామారావు’గా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
నిజాంను పొగడటం దుర్మార్గం
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిజాంను పొగడటాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. “నిజాం పాలకులు గొప్పవారైతే నాటి ప్రధాని నెహ్రూ, సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపి నిజాం మెడలు ఎందుకు వంచారు? వీరబైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి ప్రాంతాల్లో రజాకార్లు జరిపిన దారుణాలకు, వందలాది మంది నిర్బంధ హత్యలకు సీఎం ఏం సమాధానం చెప్తారు?” అని నిలదీశారు.
బీజేపీకి అవకాశం ఇవ్వాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణల డ్రామాలతో 6 గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’తోనే సాధ్యమని, ఈసారి ప్రజలంతా బీజేపీకి అధికారం ఇచ్చి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, సీనియర్ నేతలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, శ్రీవర్దన్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





