– డిసెంబర్ నుంచి హార్వర్డ్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు
– యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని యూకే బిజినెస్ స్కూల్స్ బృందం భేటీలో అన్నారు. ఎంసీఆర్ హెచఆర్డీలో గురువారం జరిగిన భేటీలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈవో ఫ్లోరా హామిల్టన్, డీన్లు, ఉన్నతస్థాయి అధికారులు, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రతినిధులు సహా 30మంది వివిధ యూకే యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేసేందుకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి పలు ఐవీ లీగ్ యూనివర్సిటీల ఆఫ్ షోర్ క్యాంపస్ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్నారు. విదేశీ విద్యాసంస్థల రాకతో స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి, ఇక్కడే పరిశోధనలు చేపట్టడానికి దోహదపడుతుందన్నారు. యూకే బిజినెస్ స్కూల్స్ తెలంగాణలో ఏర్పాటైతే ప్రపంచస్థాయి కార్పొరేట్ వ్యాపార సంస్థలు రాష్ట్రం వైపు చూస్తాయని అన్నారు. అదే సమయంలో రాష్ట్ర విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ అనుభవం, ప్రపంచస్థాయి అవకాశాలు అందుబాటులో ఉంటాయని సీఎం అన్నారు. ఈ దిశగా హార్వర్డ్, ఎంఐటి, లండన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్, నార్తఈస్టర్న్ విశ్వవిద్యాలయం వంటి అనేక ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన వంటి రంగాల్లో భాగస్వామ్యాలు ప్రారంభించవచ్చన్నారు. అలాగే విద్యార్థులకు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని దాదాపు 30వేల ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుతో భావితరాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డిసెంబర్‌లో అక్కడ నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు రావాల్సిందిగా ఈ బృందానికి ఆహ్వానం పలికారు. యూకే విద్యా వ్యవస్థలో ముఖ్యులందరికీ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థలు ముందుకొస్తున్నాయి. టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటాసెంటర్ నిర్మించనుందని, లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయాలు, ఫార్చ్యూన్-500 కంపెనీలు తెలంగాణాలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, అలాగే ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటి ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




