ఎండీఆర్ ఛార్జీల భారం వద్దు

– మినహాయింపు కోరుతున్న పెట్రో డీలర్స్
– కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులను కలిసి విజ్ఞప్తి

న్యూదిల్లీ, సెప్టెంబర్ 17: తమకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పెట్రో డీలర్లు కోరుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం అమ్మకాలపై యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు వర్తించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని పెట్రోల్ డీలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో గురువారం సమావేశమై చర్చలు జరిపారు. కొత్త యూపీఐ నిబంధనల ప్రకారం పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లలో రూ.2,000 దాటిన ప్రతి లావాదేవీపై రూ.5 ఎండీఆర్ ఛార్జీ విధిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో జరిగే మొత్తం కొనుగోళ్లలో సుమారు 30 నుంచి 40 శాతం లావాదేవీలు ఈ పరిధిలోకి వస్తాయని డీలర్లు చెబుతున్నారు. పెట్రోల్ అమ్మకాలు నిర్దే శిత కమీషన్లపై ఆధారపడి జరుగుతాయని, ఎండీఆర్ ఛార్జీల భారం తమ మార్జిన్లను దెబ్బతీస్తుందని డీలర్ల సంఘం ఆందోళన వ్యక్తంచేసింది. సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికారులు ఎండీఆర్ విధింపు వెనుక ఉన్న కారణాలను వివరించారు. దేశంలో యూపీఐ డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. విస్తరణకు ఈ ఛార్జీలు అవసరమని వారు తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో తాము ముందు వరుసలో ఉన్నామని, ప్రభుత్వంతో కలిసి పనిచేశామని ఏఐపీడీఏ గుర్తు చేసింది. ఎండీఆర్ అనేది ప్రభుత్వంగానీ, ఎన్పీసీఐగానీ వసూలు చేసే పన్ను కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టంచేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *