– సాగునీటి పథకాలతో 1,39,837 ఎకరాలకు ప్రయోజనం
– రైతు పొలం నుంచి పేదవాడి వంటింటి వరకు భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం
– సోనియా గాంధీ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: రాచరికపు చీకట్లను చీల్చి ప్రజాస్వామ్య ఉదయానికి తమ ప్రాణాలనే ప్రమిదలుగా వెలిగించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల త్యాగాలు చరిత్ర ఉన్నంతకాలం చిరస్మరణీయంగా నిలుస్తాయని నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి, ఆహార–పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గుసూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని రువారం ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణా తల్లి విగ్రహానికి పూల మాల సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక తేదీ మాత్రమే కాదని, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ఈ నేల అడుగుపెట్టిన చారిత్రక మలుపు అని పేర్కొన్నారు. అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేసిన ప్రయత్నాలు, ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తుచేశారు. తెలంగాణ బిడ్డల త్యాగాలను గౌరవించిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేయడంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైందని చెప్పారు. రాష్ట్ర సాధన ఘనత అమరులదేనని, వారి త్యాగాలకు వెలకట్టలేమని అన్నారు. తెలంగాణ చరిత్రను, పోరాట వారసత్వాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందన్నారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం ద్వారా తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం కల్పించిందని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి తీసుకొస్తోందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రభుత్వ పథకాల ఫలితాలను మరింత సమర్థంగా ప్రజలకు చేరవేసేందుకు, క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు 2026 మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, రోడ్డు భద్రత, రైతు సంక్షేమం, విద్య, మహిళా సంక్షేమం, బాలల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, యువజన–క్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి పది ప్రధాన రంగాల్లో సూర్యాపేట జిల్లాలో విస్తృత కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తున్నామని చెప్పారు.
మహిళల ఆర్థిక సాధికారతకు మహాలక్ష్మి పథకం బలమైన భరోసాగా నిలిచిందన్నారు. వానాకాలం–2026లో సాగు చేసిన ప్రతి ఎకరానికి రూ.6 వేల చొప్పున 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.364.08 కోట్లు జమ చేసినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రైతుబీమా కింద 739 మంది మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.36.95 కోట్లు చెల్లించామన్నారు. 2025–26 వానాకాలంలో కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా రూ.118.41 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, జలాశయాల్లో నీటి నిల్వలు పరిమితంగా ఉండడాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లాకు 12,868 గృహాలు కేటాయించగా, 8,855 గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. రెండు పడక గదుల పథకంలో రూ.185.71 కోట్లతో 3,225 గృహాలను పూర్తి చేసి, 2,875 గృహాలను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. చేయూత పథకం కింద 1,41,948 మంది పింఛన్‌దారులకు రూ.127.98 కోట్లను అందిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లాలోని సుమారు 5.82 లక్షల ఎకరాల ఆయకట్టును పరిరక్షిస్తూ సాగునీటి సామర్థ్యాన్ని శాశ్వతంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మూసీ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ రెండో దశ తదితర ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. రూ.1,649 కోట్లతో మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం ద్వారా 53 వేల ఎకరాలకు, రూ.292.08 కోట్లతో జవహర్ జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ పథకం ద్వారా 10 వేల ఎకరాలకు, రూ.452.40 కోట్లతో రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా 14,100 ఎకరాలకు సాగునీరు అందించే పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
బెట్టెతండా, మోతె, రెడ్లకుంట, రాజీవ్ శాంతినగర్, నక్కగూడెం, ఆర్–9 ఎత్తిపోతల పథకాల కింద రూ.496.18 కోట్లతో మరో 62,737 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కల్పిస్తున్నామన్నారు. ఈ పథకాల ద్వారా మొత్తం రూ.2,889.66 కోట్ల వ్యయంతో 1,39,837 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, అనుబంధ కాలువల ఆధునీకరణకు రూ.396 కోట్లు, మూసీ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణకు రూ.75.35 కోట్లు మంజూరు చేసి పనులు కొనసాగిస్తున్నామన్నారు. రూ.266.37 కోట్లతో చేపట్టిన 39 చెక్‌డ్యామ్‌లలో ఇప్పటికే 31 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. విద్య ద్వారానే పేద కుటుంబాల భవిష్యత్తును మార్చగలమన్న లక్ష్యంతో హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఒక్కోటి రూ.200 కోట్ల వ్యయంతో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు మొత్తం రూ.600 కోట్లు మంజూరు చేశామన్నారు. సూర్యాపేట, మునగాల, మేళ్లచెరువు, అడ్డగూడూరు ప్రాంతాల్లో రూ.40 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోదాడలో 19.12 ఎకరాల్లో రూ.53.15 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం, హుజూర్‌నగర్‌లో 100 ఎకరాల్లో రూ.126 కోట్లతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 19న కోదాడలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యానిలయంలో 300కుపైగా కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ప్రకటించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఇప్పటికే 12 భారీ, మధ్యతరహా పరిశ్రమలు, 1,343 సూక్ష్మ–చిన్నతరహా పరిశ్రమల ద్వారా 7,805 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. టీఎస్–ఐపాస్ ద్వారా రూ.395.61 కోట్ల పెట్టుబడితో 60 పరిశ్రమలు ఏర్పడి వెయ్యిమందికిపైగా ఉపాధి పొందారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన అనంతరం జిల్లాలో 23,310 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి రూ.69.40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలు, బోధనాసుపత్రి, నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ బ్లాక్‌తోపాటు వైద్య మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు. సంక్షేమం అంటే కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, విద్య–వైద్యం–ఉపాధి అవకాశాలను విస్తరించడం, రైతుకు సాగునీరు, పేదవాడికి ఆహార భద్రత, మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే నిజమైన ప్రజాపాలన అని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాను సంక్షేమం, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





