ఎర్రవల్లి భూములపై యాక్షన్‌లోకి రెవెన్యూ టీమ్

– మర్కుక్ తహసీల్ కార్యాలయంలో పాత ఫైల్స్ పరిశీలన
– త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు?

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల వ్యవహరం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూములపై నెల రోజుల్లో లెక్కలు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు పాత రికార్డులను వెలికితీసి పరిశీలిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి ఏడీ సుదర్శన్ మర్కుక్ చేరుకోగా ఆర్డీవో చంద్రకళ కూడా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే వ్యవహారంపై త్వరలో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే యోచనలో రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎర్రవల్లి, వెంకటపూర్ పరిధిలోని భూముల వ్యవహారం స్టేట్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఫైల్స్ బయటకు.. సర్వే నంబర్ల పరిశీలన

మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలోని పాత ఫైల్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎర్రవల్లి, వెంకటపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లు, భూముల రికార్డులను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూములు, పట్టా భూములకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సుమారు 385 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భూముల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ఎర్త్‌లోని పాత శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తూ వాస్తవాలేంటో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *