రైతుల గోడును పట్టించుకోని రేవంత్ రెడ్డి
•వోటు వేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు అన్యాయం
•మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చార్ సౌ బీస్ హామీలిచ్చి గద్దెనెక్కి 420 రోజులు అవుతున్న రాష్ట్ర రైతాంగం ప్రజల గోడు పట్టించుకోవడంలేదని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఆవరణలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమానికి ఎమ్మెల్సీలు సురభి వానిదేవి, నవీన్ రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, జయపాల్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, రాజయ్య, విడుదల రజనీ సాయిచంద్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా, డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, మాజీ జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ కు తాను వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేమని ఇచ్చిన ఏ హామీ అమలు కావడం లేదని తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అత్తగారి ఊరికి రోడ్డు వేస్తున్నాడని… వోటు వేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు. ఇచ్చిన హామీ అమలులో ఘోరంగా విఫలం చెందాడని అన్నారు. రైతన్నలకు రూ. 2 లక్షల రుణమాఫీ వొచ్చిందా… రైతు బంధు, ఆడపడుచులకు తులం బంగారం రైతులకు రూ . 500 బోనస్ అధికారంలోకి వస్తే కుటుంబంలో ఇద్దరికీ పెన్షన్ మంజూరు చేస్తానని చెప్పి అత్తకు రూ .4000 కోడలు రూ .4000 పెన్షన్ ఇచ్చారా అని ప్రజలతో చెప్పించే ప్రయత్నం చేశారు.
రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.15 వేల నుంచి రూ .12000 ఇస్తానని చెప్పి టకి టకి మని ఎవరి ఖాతాలో జమ అయ్యాయని ప్రశ్నించారు. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టింగ్ టింగ్ అని రైతుబంధు డబ్బులు పదేండ్లలో 73 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమా చేసిన కేసీఆర్ రైతన్నలను పదేళ్లు రాజులా చూసుకున్నారని గుర్తు చేశారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అందడం లేదని 200 యూనిట్ల ఉచిత కరెంట్ కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. రైతన్నలకు రుణమాఫీ చెల్లించలేక రుణమాఫీ కాక పోవడంతో బ్యాంకు అధికారులు తలుపులు, స్టాటర్లు ఎత్తుకెళ్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలుగు భాషలో ఉన్న తిట్లన్నీ తిడుతున్నారని రేవంత్ రెడ్డికి సిగ్గు లేకుండా బతుకుతున్నారని కేటీఆర్ అన్నారు. కులగణన సక్రమంగా చేయకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని మళ్లీ కొత్త నినాదం ఎత్తుకొని 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త డ్రామాకు తెరలేపారని కేటీఆర్ అన్నారు.
ఈ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు రైతులు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న 56 మంది చిన్నారులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంత దరిద్రపు పాలన ఏది లేదని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేదని ఒక్కో రైతుకు రూ .17,500 ఈ ప్రభుత్వం బాకీ పడిందని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిదీ ఆయన కుటుంబం, ఆయన స్వార్థం కోసమే పనిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు ఎడ్మా సత్యం, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, మాడుగుల మాజీ జెడ్పిటిసి రవితేజ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ నాయక్, వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.





