– ఓటర్ల హక్కుల విషయంలో పారదర్శకత అవసరం
– బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలు ప్రజల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలను కలిగిస్తున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన బాధ్యత అని చెప్పారు. గత పది నెలల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చిందంటూ వారి అభ్యంతరాలు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఎన్నికల జాబితా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంశాలను కూడా స్పృశిస్తున్నాయన్నారు.
ఫారం-6లో మార్పులపై స్పష్టత ఇవ్వాలి
కొత్తగా ఓటు హక్కు పొందే పౌరులు ఉపయోగించే ఫారం-6లో ఎస్ఐఆర్ కు సంబంధించిన ప్రశ్నలను చేర్చడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలన్నారు. ఫారం-6 నిబంధనల ప్రకారం నిర్దేశించిన చట్టబద్ధమైన ఫారం అయితే అందులో మార్పులు చేయడానికి ఏ ప్రక్రియను అనుసరించారు.. ఎవరి అనుమతితో మార్పులు చేశారు.. ఆ మార్పులకు చట్టపరమైన ఆధారం ఏమిటి అనే విషయాలను ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందే యువతకు అనవసర ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ఈసీఐ నెట్, ఓటర్ల డేటాపై పారదర్శకత అవసరం
ఈసీఐ నెట్ వంటి కేంద్రీకృత ఐటీ వ్యవస్థ ద్వారా ఓటర్ల డేటాలో మార్పులు చేసే విధానం ఉంటే క్షేత్రస్థాయిలో చట్టబద్ధమైన అధికారాలు కలిగిన ఈఆర్వోల పాత్ర, వారి పర్యవేక్షణ, బాధ్యత ఏమిటో ఎన్నికల సంఘం స్పష్టం చేయాలని మంత్రి పొన్నం కోరారు. ఓటర్ల డేటా ఎవరు మార్చారు.. ఎప్పుడు మార్చారు.. ఏ కారణంతో మార్చారు.. ఏ అధికారి అనుమతితో మార్చారు అనే వివరాలకు ఆడిట్ ట్రయల్ ఉండాలన్నారు. అవసరమైన మేరకు ఆ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థల విషయంలో భద్రతా ప్రమాణాలు, అధికారాల విభజన, జవాబుదారీతనం వంటి అంశాలపై స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఓటర్ల పేర్ల తొలగింపుపై పూర్తి వివరాలు వెల్లడించాలి
‘సర్’ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగింపునకు గురైనట్లు నివేదికలు వెలువడ్డాయని, తొలగింపు ఏ కారణాలపై జరిగింది.. ఎంతమంది పేర్లు తొలగించారు.. ఎంతమంది అభ్యంతరాలు తెలిపారు.. ఎన్ని పేర్లు తిరిగి చేర్చారు అనే వివరాలను రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా బహిరంగపరచాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనే విషయం రాజకీయ వాదోపవాదాల ద్వారా తేలదన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్తి డేటా, తొలగింపుల వివరాలు, కొత్తగా చేర్చిన పేర్లు, అభ్యంతరాలు, అప్పీళ్ల పరిష్కారం వంటి సమాచారాన్ని ప్రజల ముందుంచాలని కోరారు.
పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలి
జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలోని ఎన్నికల సంఘం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తకుండా ప్రతి నిర్ణయం చట్టబద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా చూడాలని మంత్రి పొన్నం సూచించారు. అన్ని నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే జరిగాయని ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టం చేసిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వివిధ స్థాయిల్లో నమోదైన అభ్యంతరాలపై పూర్తి వివరాలను బహిరంగపరచడం ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కు కాపాడేలా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒక్క అర్హుడైన ఓటరు పేరు కూడా పొరపాటున తొలగింపునకు గురికాకుండా చూడటం ఎంత ముఖ్యమో అనర్హుల పేర్ల విషయంలో చట్టం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు అని, అందువల్ల ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, డేటా మార్పులు వంటి ప్రతి దశలో పారదర్శకత, చట్టబద్ధత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





