– రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
– ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
కొమురవెల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలో గురువారం పర్యటించనున్న నేపథ్యంలో బహిరంగ సభా ప్రాంగణం, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడంతోపాటు, జిల్లాలో మొత్తం రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.451.13 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు ఇప్పటికే రూ.92.98 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనతోపాటు జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు, జనగామ నియోజకవర్గంలో రూ.6.89 కోట్లతో నిర్మించనున్న మూడు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, సిద్ధిపేట జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్ లు,కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రాన్ని, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ప్రారంభిస్తారు.
ఈ సభలోనే ఇందిరమ్మ చీరల పంపిణీ
ఇందిరమ్మ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరల పంపిణీ జరగనుంది. సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆడబిడ్డలకు పుట్టింటి సారెగా కోటి ఇందిరమ్మ చీరలను మహిళలకు ప్రభుత్వం ఆత్మీయ కానుకగా అందిస్తున్నది. ఈ సారి చిలుక పచ్చ రంగుల్లో ఆకర్శణీయంగా రెండు డిజైన్లలో తొమ్మిది మీటర్ల, 6.30 మీటర్ల చీరలను అందించనున్నారు. పంపిణీకి ఇందిరమ్మ చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఆశయాలకు అనుగుణంగా మహిళల గౌరవం, ఆత్మగౌరవానికి, మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి లక్ష్యంగా మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం బాటలు వేస్తున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





