26న నూతన పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ

– రాజ్యాంగ స్ఫూర్తితో సామాజిక భద్రత
– ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు గౌరవం
– మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 18: రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అనే స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల‌ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క అన్నారు. రాజ్యాంగ దినోత్సవమైన ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మందికి కొత్తగా చేయూత పెన్షన్దారుల‌ ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కోటిమంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సమాజంలో ఆర్థికంగా అండ అవసరమైన వారికి భద్రత కల్పించడం, మహిళలకు ఆత్మగౌరవం అందించడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ విధానంలో కీలక భాగమని మంత్రి పేర్కొన్నారు. అందుకే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు.

4,63,857 కుటుంబాలకు కొత్తగా చేయూత

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు కొత్తగా మంజూరయ్యే 4,63,857 చేయూత పెన్షన్లు వారి కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసాను అందిస్తాయని సీతక్క తెలిపారు. పెన్షన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్న అర్హులకు 26నుంచే ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నామని, పెన్షన్ మొత్తం అదే రోజు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.

కోటిమంది మహిళలకు ఇందిరమ్మ చీర

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 26న విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్లనున్నామని మంత్రి తెలిపారు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించే కార్యక్రమానికి ఆరోజు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డకు చీర అంటే కేవలం వస్త్రం కాదని, పుట్టింటి ఆత్మీయత, గౌరవానికి ప్రతీక అని సీతక్క అన్నారు. ఆడబిడ్డను గౌరవించే తెలంగాణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇందిరమ్మ చీరలను అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు చీర అందించడంతోపాటు వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, ఉపాధి, వ్యాపార అవకాశాలు, మార్కెట్ సదుపాయాలను కల్పిస్తూ ఆర్థిక సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *