కేటీఆర్ వ్యాఖ్యలు కృతఘ్నతకు నిదర్శనం

– నెహ్రూ కృషిని తక్కువ చేస్తారా?
– పదేళ్లలో కృష్ణా బేసిన్‌కు బీఆర్‌ఎస్‌ ఏం చేసింది?
– సాగర్‌ నుంచి ఏపీ ప్రతిపాదించిన నీటి తరలింపుపై ఇప్పటికే అభ్యంతరాలు తెలిపాం
– బీఆర్ఎస్ పై ద్వజమెత్తిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబరు 18: రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించి ఆమెపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యలు చేయడం కృతఘ్నత అని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ సంకల్పం లేకుంటే రాష్ట్రం ఏర్పడేదే కాదని, ఈ విషయాన్ని కేసీఆర్‌ కూడా శాసనసభలో చెప్పారని గుర్తు చేశారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్‌ నాయకత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సోనియా గాంధీ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన ఉందా, లేదా అన్నది అసలు విషయం కాదు.. తెలంగాణ ఏర్పాటు కోసం ఆమె తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని గుర్తుంచుకోవాలి.. రాష్ట్రం ఏర్పడిన తరువాతే కేటీఆర్‌ కుటుంబానికి తెలంగాణలో పదవులు వచ్చాయి.. ఆ విషయాన్ని మరిచి తెలంగాణ ఇచ్చిన నాయకురాలిపై విమర్శలు చేయడం బీఆర్‌ఎస్‌ నాయకుల నైజాన్ని బయటపెడుతోంది అని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. ప్ర‌థ‌మ‌ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూపై కేటీఆర్‌ వ్యాఖ్యలనూ మంత్రి తప్పుబట్టారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నెహ్రూ కృషిని కేటీఆర్‌ తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలిపి సుమారు 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న నాగార్జునసాగర్‌ ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు పదేళ్ల పాలనలో తాము పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులేమిటో బీఆర్‌ఎస్‌ చెప్పాలని సవాల్‌ విసిరారు. సాగునీటి రంగంలో రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్ ఆ వ్యయానికి తగిన ఫలితాలను రైతులకు అందించలేకపోయిందని ఉత్తమ్‌ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, ఆర్డీఎస్‌ ఆధునికీకరణ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టుల పురోగతిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ సాగునీటి వ్యయంలో దాదాపు 75 శాతం గోదావరి బేసిన్‌కే కేటాయించి కృష్ణా బేసిన్‌కు సుమారు 25 శాతమే వెచ్చించారని పేర్కొన్నారు. దీనివల్ల మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల రైతులకు అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా జలాల విషయంలోనూ బీఆర్‌ఎస్‌ వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని మంత్రి విమర్శించారు. 811 టీఎంసీల నీటిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించే నిష్పత్తికి గత ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం పరీవాహక ప్రాంతం, సాగునీటి అవసరాలు, జనాభా తదితర అంశాల ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు రావాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ ముందు వాదిస్తోందని వివరించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఏపీ 4,464 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోగా తెలంగాణ వినియోగం 1,993 టీఎంసీలకే పరిమితమైందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. ప్రస్తుత జల సంవత్సరంలో అక్టోబరు 30 నాటికి ఏపీ 98.16 టీఎంసీలు వినియోగించుకోగా తెలంగాణ 122.74 టీఎంసీలు వినియోగించుకుందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని 2014లో ప్రకటించినప్పటికీ దాని సమగ్ర ప్రాజెక్టు నివేదికను 2022లోనే సమర్పించారని, అనుమతుల సాధనలో జరిగిన జాప్యంతో ప్రాజెక్టు వ్యయం పెరిగిందని ఆరోపించారు. సాగర్‌ జలాశయం నుంచి సుమారు 1.8 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏపీ ప్రతిపాదించిన తాగునీటి పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు తెలిపిందని మంత్రి వెల్లడించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఏపీ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను పంపినట్లు చెప్పారు. తెలంగాణ నీటి హక్కులను ప్రభావితం చేసే ఏ పథకాన్నైనా వ్యతిరేకిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *