– హైటెక్స్‌లో రేపటి నుంచి ప్రారంభం
– హాజరవుతున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : దేశ ప్రగతిలో కీలకమైన రోడ్లు, రహదారుల మౌలిక వసతుల రంగానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి వేదిక సిద్ధమైంది. ఈనెల 19 నుండి 22వ తేదీ వరకు నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తుండటం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది ఐఆర్‌సీ సదస్సును తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా ఆయన అంగీకరించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సదస్సును గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి రోడ్లు, హైవేల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల దిగ్గజ ప్రతినిధులు సహా సుమారు 3,500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1934లో ఏర్పాటైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ దేశంలో రోడ్లు, వంతెనల నిర్మాణ నాణ్యత, భద్రత, ఆధునిక సాంకేతికతల వినియోగంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఆరుసార్లు ఐఆర్‌సీ సమావేశాలు జరగగా ఇప్పుడు 7వ సారి నిర్వహిస్తున్నారు. హైటెక్స్ వేదికగా జరగనున్న సదస్సులో మౌలిక రవాణా రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలపై నిపుణులు ప్యానెల్ చర్చలు జరపనున్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఏర్పాటైనప్పటినుండి దేశంలో రోడ్లు, వంతెనల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. రోడ్ల నిర్మాణంలో నాణ్యత, భద్రత, కొత్త టెక్నాలజీల వినియోగం వంటి అంశాల్లో ఎన్నో మంచి మార్పులకు ఈ సంస్థ కారణమైంది. హైటెక్స్ వేదికగా జరగనున్న సమావేశంలో పర్యావరణానికి అనుకూలమైన రోడ్ల నిర్మాణం, వాతావరణ మార్పులను తట్టుకునేలా మౌలిక సదుపాయాల అభివృద్ధి(క్లైమేట్ రెసిలియంట్ రోడ్లు), డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక రవాణా వ్యవస్థలు వంటి ముఖ్యమైన అంశాలపై పానల్ డిస్కషన్ జరగనున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సురక్షితంగా నడిచే హక్కు(రైట్ టు వాక్) అంశంపై ప్యానల్ డిస్కన్‌లో భాగంగా చర్చ జరగనుందని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. సదస్సులో దాదాపు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు, 19 టెక్నికల్ సెషన్లు ఏర్పాటు చేశారు. తద్వారా సరికొత్త యంత్రాలు, టెక్నాలజీలు, నిర్మాణ పద్ధతులను పరిశీలించే అరుదైన అవకాశం లభించనుంది.
కేంద్ర-రాష్ట్ర సంయుక్త సమీక్ష & బడ్జెట్ కేటాయింపులు
సదస్సు ప్రారంభమైన వెంటనే తెలంగాణలో రోడ్ల నిర్మాణం, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టుల ప్రగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, పట్టణాలకు అనుగుణంగా మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే 2026–27 బడ్జెట్‌లో రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధి కోసం ఏకంగా ₹5,677 కోట్లు కేటాయించడమే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ‘తెలంగాణ పెవిలియన్’ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధి పనులను ప్రతినిధులకు వివరించనున్నామన్నారు.
కీలక ప్రాజెక్టులు & ‘తెలంగాణ రైజింగ్- 2047’ లక్ష్యం
రాష్ట్రంలో రవాణా రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ ఆర్ ఆర్), హైదరాబాద్–విజయవాడ హైవే విస్తరణ, హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్యూచర్ సిటీ–బందర్ పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎస్ హెచ్-167 అభివృద్ధి, కరీంనగర్–వరంగల్ హైవే, హెచ్‌ఏఎం (హామ్) పద్ధతిలో గ్రామీణ రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ రోడ్ల నిర్మాణాలు పూర్తయితే పారిశ్రామిక రంగానికి మహర్దశ పడుతుందని, రైతులు తమ పంటలను మార్కెట్లకు వేగంగా తరలించవచ్చని, ప్రయాణ సమయం-ఖర్చు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్ల అభివృద్ధి ఫలితంగానే రాష్ట్ర జీఎస్‌డీపీ 2025–26 నాటికి సుమారు ₹17.82 లక్షల కోట్లకు చేరింది. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంలో భాగంగా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మెరుగైన కనెక్టివిటీ ఉంటేనే భారీగా పెట్టుబడులు వచ్చి నూతన పరిశ్రమలు ఏర్పాటవుతాయని, తద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





