పాలమూరులో సిరుల పంటలు పండిస్తా..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ఉమ్మడి పాలమూరులోని జూరాల, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ళ, నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీరు అందించి పాలమూరును పసిడి పంటల పొలాలుగా మారుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.1000 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ఆయన వనపర్తికి విచ్చేశారు. ఉదయం పాలిటెక్నిక్ కళాశాలలో హెలీప్యాడ్ వద్ద చేరుకోగా, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ శివసేన రెడ్డిలు ఘన స్వాగతం పలికారు.

మొదటగా వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించిన సీఎం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన బాల్య విద్యాభ్యాసం కాలంలో వనపర్తిలో నివాసముండే ఇంటి యజమాని పార్వతమ్మ కుటుంబాన్ని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తన చిన్ననాటి మిత్రులను కలిసి భోజనం చేసిన అనంతరం, పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు:

“మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజమ్మ ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు ఆరగించి, రాయలసీమను రత్నాల సీమ చేస్తానని హామీ ఇచ్చి 811 టీఎంసీ నీటిని 512 టీఎంసీలకు తగ్గించేందుకు సంతకాలు చేసిన మహాఘనుడు,” అని ఆయన ఎద్దేవా చేశారు. “గత ఐదు సంవత్సరాల్లో వనపర్తి నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ నేతలు అవినీతితో మాయ చేశారు. డబ్బు, కుళ్లు, కుట్రల రాజకీయం చేశారు,” అని విమర్శించారు.

వనపర్తితో నా బంధం:

“ఈ ప్రాంతంలో చదువుకోవడం వల్లే నాకూ రాజకీయ చైతన్యం లభించింది. వనపర్తి నా బంధం విడదీయలేనిది. నేను ఎక్కడికి వెళ్లినా వనపర్తిని మర్చిపోను,” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “జూరాల, నెట్టెంపాడు, కోయిలసాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే ముందుకు వెళ్లాయి. ఇప్పుడీ ప్రాజెక్టులను పూర్తిచేసి, పాలమూరును పసిడి పొలాలుగా మార్చుతాం,” అని హామీ ఇచ్చారు. “మహిళల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించాం. స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇస్తూ, బట్టల కుట్టు పరిశ్రమను మహిళలకు అప్పగిస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం,” అని తెలిపారు.

కేంద్రంపై విమర్శలు:

“తెలంగాణకు నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయిష్టత చూపిస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడి వరంగల్ ఎయిర్‌పోర్టును మంజూరు చేయించమని అడిగే ధైర్యం లేకుండా, నేను చేసిన పనికే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు,” అని సీఎం విమర్శించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు తూడి మెఘా రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, శంకరయ్య, రాజేష్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కొత్త ఐటీ టవర్, కొత్త ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, జిల్లా పరిషత్ (బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం, శ్రీరంగాపురం దేవాలయం అభివృద్ది పనులు, పెబ్బేరులో 30 పడకల దవాఖాన భవన నిర్మాణం, రాజానగరం – పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ భవనం, పట్టణంలో సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి  వెంట జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ , మంత్రులు జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి , స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *