రాజకీయ సుడిగుండంలో హైదరాబాద్ మెట్రో!

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ప్రజా రవాణా వ్యవస్థ వెన్నెముక వంటిది. నిత్యం పెరుగుతున్న వాహనాల రద్దీ, ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి నగరవాసులకు విముక్తి కల్పించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ అత్యవసరం. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సమన్వయ లోపం, నిధుల వివాదం, రాజకీయ ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంది. తాజాగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి మంజూరు కావలసిన రూ. 13,600 కోట్ల రుణం , నిధుల కేటాయింపు తన పరిధిలోకి రావంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించాయి. మెట్రో ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల వ్యవహారం రైల్వే శాఖ పరిధిలో లేదని (ఇది సాధారణంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వొస్తుంది) ఆయన తేల్చిచెప్పారు. గత జూన్ (2026) నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి అశ్వినీ వైష్ణవ్‌ను స్వయంగా కలిశారు. మెట్రో స్వాధీన ప్రక్రియ, రెండో దశ నిధులపై అప్పుడు చర్చలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఐదు నెలల తర్వాత రైల్వే మంత్రి ఆ విషయమే తనకు తెలియదని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది .

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు ఆగిపోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌లే కారణమని ఆరోపించడంతో మెట్రోపై రాజకీయాలు మరింత ముదిరాయి. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశ నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్సల్టెంట్‌ను నియమించిందని, ఎస్‌బీఐ క్యాప్స్ ద్వారా నిధులు అందే దశకు చేరుకున్నాయని సీఎం గుర్తుచేశారు. అయితే, కిషన్ రెడ్డి, కేటీఆర్‌ల రాజకీయ వైఖరి వల్లే ఆ నిధుల ప్రక్రియ వాయిదా పడిందని ఆయన విమర్శించారు. ఐఆర్‌ఎఫ్‌సీ రుణ ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫీజుల రూపంలో రూ. 84 కోట్లు, కన్సల్టెన్సీ కోసం మరో రూ. 176 కోట్లు చెల్లించిందని సీఎం గుర్తుచేశారు. కేంద్రం నుంచి రుణం విడుదల కాకపోవడంతో టేకోవర్ ప్రక్రియ ఆలస్యమై, రాష్ట్ర ఖజానాపై రోజువారీ ఆర్థిక భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మెట్రో రెండో దశ కింద సుమారు 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లను రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా, మొత్తం 122.9 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించి రూ. 38,595 కోట్ల వ్యయంతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) కేంద్రానికి సమర్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది . ఇందులో భాగంగానే మొదటి దశ నిర్వాహక సంస్థ ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు రూ. 13,600 కోట్ల రీఫైనాన్సింగ్ కోసం ఐఆర్‌ఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నామని రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఆ రుణ ప్రతిపాదన గురించి తనకు సమాచారమే లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేయడం ఇరు ప్రభుత్వాల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను బహిర్గతం చేసింది .

నిధుల వివాదంతో పాటు మరిన్ని సాంకేతిక, పరిపాలనాపరమైన చిక్కులు మెట్రో విస్తరణకు అడ్డంకిగా మారాయి. మొదటి దశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొలిక్కి వొస్తేనే రెండో దశపై ముందుకు వెళ్లగలమని కేంద్రం షరతులు పెడుతున్నది . మరోవైపు, ఎల్ అండ్ టీ సంస్థ సుమారు రూ. 13,000 కోట్ల రుణభారం, రూ. 2,100 కోట్ల ఈక్విటీ చెల్లింపుల సెటిల్‌మెంట్ ప్రక్రియ రాష్ట్ర ఖజానాకు పెను భారంగా మారింది. దీనికి తోడు, ప్రయాణికుల రద్దీ అంచనాలు (పీహెచ్‌పీడీటీ), డీపీఆర్‌ల పరిశీలన పేరుతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్థాయిలో జరుగుతున్న ఆలస్యం ప్రాజెక్టు వ్యయాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంది.

దేశంలోని ఇతర నగరాల మెట్రో ప్రాజెక్టులకు వేగంగా లభిస్తున్న కేంద్ర క్యాబినెట్ ఆమోదాలు, నిధులు హైదరాబాద్ విషయంలో ఎందుకు ఆలస్యమవుతున్నాయనే ప్రశ్న నగరవాసులను వేధిస్తున్నది . అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోవడం వల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. పాతబస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ కారిడార్లను అనుసంధానించే రెండో దశ మెట్రో నగర ఆర్థిక ప్రగతికి ఎంతో కీలకం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపైకి రావాలి. కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే మంత్రిత్వ శాఖలు, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు సంయుక్తంగా చర్చించి డీపీఆర్ ఆమోదాలు, రుణ సమీకరణపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. ఎల్ అండ్ టీ స్వాధీన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తూనే, రెండో దశ పనులకు తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలి. లేనిపక్షంలో పెరుగుతున్న నిర్మాణ వ్యయం, ట్రాఫిక్ కష్టాలు హైదరాబాద్ ప్రగతి రథానికి బ్రేకులు వేయడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *