- మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు
- మూసీ అభివృద్దిలో గుడితో పాటు మసీదు, చర్చి, గురుద్వారాల నిర్మాణం
- మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8 : మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంప్రదాయ కోర్సులు కాకుండా వారి జీవనోపాధికి ఉపయోగపడే శిక్షణ ఇప్పించాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ (Minority Welfare) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్నట్లే మైనారిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలని,ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3కి ఎంపికైన మైనారిటీ అభ్యర్థుల్లో ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేసి మైనారిటీ సంక్షేమ శాఖలో బాధ్యతలు అప్పగించి… ఆ శాఖ పరిధిలో చేపట్టే అన్ని కార్యక్రమాలపై పూర్తి అవగాహన కలిగించేలా వారిని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు ప్రోత్సాహాకాలు అందించే కార్యక్రమానికి గ్రూప్స్‌కు ఎంపికైన వారిని, క్రీడాకారులను ఆహ్వానించి విద్యా, క్రీడల ప్రాధాన్యతను వారికి తెలియజేయాలని సూచించారు.
ఇమామ్, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ పారితోషికాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మైనారిటీ పాఠశాలల్లో బోధనలో ఏఐకు ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. భూ లభ్యత ఉన్న చోట ఖబరస్తాన్‌లకు స్థలాలను కేటాయిస్తామని సీఎం తెలిపారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్లతో రీట్రోఫిట్టింగ్ చేయడం ద్వారా ఆటోడ్రైవర్లకు ఇంధన ఖర్చులు లేకుండా చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మూసీ రివర్ ఫ్రంట్‌లో భాగంగా గుడితో పాటు మసీద్, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా మతాలకు సంబంధించిన సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను, తెలంగాణలోని గంగా జమునా తెహ్‌జీబ్ ను తెలియజేసేలా ఆ కట్టడాలు ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. మన సంస్కృతులను అధ్యయనం చేసే గొప్ప అధ్యయన కేంద్రాలుగా అవి పరిఢవిల్లాలని సీఎం ఆకాంక్షించారు. సమీక్షలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు) మహ్మద్ షబ్బీర్ అలీ, టీజీఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్ మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబాని, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మహ్మద్ ఓబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ కొకడాన్, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా తదితరులు పాల్గొన్నారు.





