రైతు డిక్లరేషన్‌పై రాజకీయ దుమారం

– అధికార, విపక్షాలమధ్య మాటల యుద్ధం
– ఆ ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటున్న వ్య‌వ‌సాయ శాఖ‌

(మండువ రవీందర్‌రావు)

వరి వంగడాలు కొనుగోలు చేయాలంటే రైతులు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ (‌స్వయం హామీ పత్రం) ఇవ్వాల్సిందేనన్న వార్త రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇదిప్పుడు రైతాంగాన్ని అయోమయంలో పడేసింది. దీనిపైన రైతు సంఘాలు, రైతు నాయకులు తీవ్ర నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. అధికార విపక్షాలమద్య మరోసారి మాటల యుద్ధానికి దారితీసింది. దీంతో వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. ఇందులో ఏమాత్రం నిజం లేదని, రైతులెవరూ దీన్ని నమ్మవద్దని ఆ శాఖ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌బి.గోపీ ప్రకటన వెలువడింది. డీలర్లు ఎవరూ డిక్లరేషన్‌ అడగరని, ఒకవేళ అడిగినట్లు తమకు సమాచారం ఉంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే రైతులెవరూ విత్తనాల విషయంలో ఆందోళన పడవద్దనికూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇంత సంచలనం కలిగించిన వార్తకు కారకులెవరన్నది మాత్రం ఇంకా సస్పెన్షన్‌గానే ఉంది. వాస్తవంగా రాష్ట్రంలో పండించిన వరిధాన్యం కొనుగోళ్ళపై ఉన్న కేంద్ర నిబంధనలు, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన నీటి కొరత కారణంగా వరి పంటను వేసుకోవద్దని  ‌ప్రభుత్వం సూచిస్తూ వస్తున్నది. ఒక సీజన్‌ ‌పంటను వాయిదా వేసుకోవాల్సిందిగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. కాని పక్షంలో వరికి బదులు ఆరుతడి పంటలను వేసుకోవాలని ఆయన చెబుతున్నారు. నీటితోపాటు, విద్యుత్‌నుకూడా సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలన్నారు. ఈ క్రమంలోనే వరి విత్తనాలు కొనుగోలు చేసే రైతులు పంటకు కావాల్సిన నీరు, విద్యుత్‌, ‌పంట కొనుగోలు విషయంలో స్వయం బాద్యులేగాని ప్రభుత్వం, విత్తన డీలర్లకు ఎలాంటి సంబందం లేదని హామీ ఇచ్చిన తర్వాతే వరివంగడాలను కొనుగోలు చేయాలన్న వార్త వైరలైంది.
వైరల్‌గా మారిన ఆ అంగీకార పత్రంలో ఏముందంటే.. ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం వరివేయవద్దని చెబుతున్నది. కాని నాకు వరి మాత్రమే పండుతుంది. కావున నాకు ఇష్టమైన వడ్లను వేసేందుకు నా సొంత నిర్ణయంతో తీసుకుంటున్నాను. కరెంటు కారణంగాకాని, నీరుఅందకగాని ఏ విధమైన కారణంతోగాని పంటరానిచో డీలర్లకుగాని ప్రభుత్వానికిగాని ఎలాంటి సంబంధము లేదు. ఇది నా ఇష్టపూర్వకంగా నేను తీసుకుంటున్న నిర్ణయం. కావున నాకు విత్తనాలు అమ్మగలరని కోరుతూ వ్రాసి ఇస్తున్న సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌ఫారం. అంటూ క్రింద రైతు వివరాలు, సంతకం’’తో ఉన్న ఈ ఫారమ్‌ ‌తెలంగాణ రైతాంగంలో తీవ్ర గందరగోళంలో పడేసింది.
గతంలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ కాలంలోకూడా వరి వేస్తే ఉరే అన్నది బహుళ ప్రచారంలోకి వచ్చింది. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపైన దాడికి నాటి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ఆయుధంగా వినియోగించుకుంది. బిఆర్‌ఎస్‌ ఓటమికి అదికూడా ఒకకారణంగా నిలిచింది. వాస్తవానికి  నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుండి కొనుగోలు చేసే బాయిల్డ్ ‌రైస్‌ (ఉడకపెట్టిన బియ్యం) కొనబోమని స్పష్టంచేయడంతో రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోళ్ళపై ఆనాడు అనిశ్చిత ఏర్పడింది. దీంతో రైతులు వరి వేసుకుంటే భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులకు లోనవుతారన్న అర్థంగా వరి వేసుకుంటే ఉరే అన్న మాట పాలకుల నోట రావడం పెద్ద దుమారాన్నే లేపింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా అదే అంశాన్ని పదేపదే గుర్తు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంకూడా వరి వేసుకోవద్దంటున్నది. వరి తప్ప ఇతర పంటలు వేసుకోవాలంటున్నది. అయితే ఇతర పంటలు వేసుకునే అలవాటు లేని వారు వద్దన్నా వరి వేసుకుంటారని, వారిని కంట్రోల్‌ ‌చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టిందన్న ఆనుమానాలు రైతుల్లో ఏర్పడింది. ఈ అంశాన్ని తీసుకుని ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నది. పుష్కలంగా ఉన్న గోదావరి నీటిని ఎత్తిపోయకుండా ఇంతకాలం చోద్యం చూసిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ప్రస్తుత కరువుకు కారణమని ఆరోపిస్తున్నది. ఇది ప్రకృతి వైపరీత్యంవల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువుగా ఆ పక్షం అభివర్ణిస్తున్నది. కల్వకుర్తి, దేవాదుల, కన్నెపల్లి ఎత్తిపోతల పథకాలను పూర్తి సామర్థ్యంతో నడపకపోవడమే ఇందుకు కారణంగా ఆరోపిస్తున్నది. విస్తృత ప్రచారంలోకి వచ్చిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ‌ఫారమ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని వ్యవసాయ శాఖ చెబుతున్నా ఆ ఫారమ్‌ ‌రాష్ట్రంలో పెద్ద గందరగోళాన్నే సృష్టించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *