– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– కేంద్ర సాయం కోసం అభ్యర్థన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా మారిన వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి కారణాల వల్ల 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన 365 మండలాల్లో 111 మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా, మిగిలిన 254 మండలాలను మోస్తరు కరువు ప్రాంతాలుగా వర్గీకరించారు. ఈ కరువు మండలాల నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైన తేదీ నుండి ఆరు నెలలపాటు అమలులో ఉంటుంది. దీనికి సంబంధించిన జాబితాను జిల్లా గెజిట్లలో ప్రచురించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
కేంద్ర సహాయం కోసం విజ్ఞప్తి
కరువు నివారణ, సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.20,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. క్షేత్రస్థాయిలో కరువు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరింది. నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో దాదాపు 17 శాతం వర్షపాత లోటు నమోదు కావడం, అలాగే జలాశయాలలో నీటి మట్టాలు భారీగా పడిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గి, 69.19 లక్షల ఎకరాల నుంచి 57 లక్షల ఎకరాలకు పరిమితమైంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కరువు ప్రభావిత మండలాల్లోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంతోపాటు, వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి సరఫరా, పశుగ్రాసం పంపిణీ, ఉపాధి హామీ పనులు అదనంగా మరో 50 రోజులు కల్పించాలని, రైతులకు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించేలా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కూడా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





