ఆగస్టు నాటికి మూసీ పునరుజ్జీవ పనులు

  • తొలి దశలో రూ.7,055 కోట్లతో అభివృద్ధి.. 2027 డిసెంబర్ నాటికి పూర్తి
  • మనుషులను దూరం చేయం.. భాగస్వాములను చేస్తాం: సబ్ కమిటీ స్పష్టం
  • ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ఆలైన్‌మెంట్‌లో మార్పులు
  • రబ్బర్ డ్యామ్ నమూనాను పరిశీలించిన మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 8 : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు (Musi River Rejuvenation) పనులను ఆగస్టు నాటికి ప్రారంభించాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. ప్రజల ఆస్తులపై ప్రభావం లేని ఐదు కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని తెలిపింది. నిర్మాణాలపై ఎక్కువ ప్రభావం లేకుండా అలైన్‌మెంట్‌లు మార్చాలని సూచించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యంతో చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కేవలం ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి అంటే మనుషులను దూరం చేయడం కాదు, వారిని భాగస్వాములను చేయడమేనని చాటి చెబుతూ అధికారులకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్లో ఉన్న ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి, వారిలో పూర్తి స్థాయి విశ్వసనీయత కల్పించేలా అధికారుల కార్యాచరణ ఉండాలని సబ్ కమిటీ ఆదేశించింది. ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కమిటీ నొక్కి చెప్పింది. ప్రజల ఆస్తులకు, నివాసాలకు కనీస నష్టం కూడా కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇప్పటికే ఉన్న నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా ఆలైన్ మెంట్‌ను మార్చుకోవాలని కమిటీ సూచించింది. అత్యంత జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించింది.

“మూసీ పునరుజ్జీవనం ద్వారా నగరం రూపురేఖలు మారడమే కాకుండా, పరివాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అద్భుత ప్రాజెక్టు సాకారం అవుతుందని, “అభివృద్ధి – ప్రజా హితం” రెండూ సమాంతరంగా సాగాలని కేబినెట్ సబ్ కమిటి అధికారులకు దిశ నిర్దేశం చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన మూసీ పునర్జీవం ప్రాజెక్టు క్యాబినెట్ సబ్ కమిటి సమావేశం శుక్రవారం ప్రజాభవన్ లో జరిగింది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారలతో కలిసి డిప్యూటి సీఎం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు పురోగతి, నిధుల సమీకరణ, నిర్మాణ పనులకు సంబంధించిన క్యాలెండర్ పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

5 దశల్లో 55 కిలోమీటర్ల వరకు అభివృద్ది పనులు

మూసి పునర్జీవన ప్రాజెక్టు 5 దశల్లో 55 కిలోమీటర్ల వరకు అభివృద్ది పనులు చేపట్టనున్నామ‌ని, దీనిలో భాగంగా ఫేజ్ -1 సుమారు ₹7,055 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి నిధులు సమకూర్చుకునేందుకు సాంకేతిక, ఆర్థిక చర్చలు విజయవంతంగా ముగిశాయని అధికారులు మంత్రులకు వెల్లడించారు. ఫేజ్ -1లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఉస్మాన్ సాగార్ నుంచి బాపుఘాట్ 21 కిలోమీటర్ల మేరకు నిర్మాణ పనులను ఏటువంటి ప్రభావం లేని తొలి ఐదు కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు అదేశించారు.

మూసీ పునర్జీవనంలో భాగంగా నదిలో ఉన్న చెత్త చెదరాన్ని తొలగించి, పరిశుభ్ర పర్చడం, హైడ్రాలజీ ప్రకారంగా రివర్ బెడ్ ప్రొఫైలింగ్ చేయడం, వరద నియంత్రణ కోసం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నదికి రెండు వైపులా రోడ్ల నిర్మాణం, నదికి రెండు వైపులా ప్రధాన మురుగు నీటి కాలువల నిర్మాణాం, నాలాలు ఏర్పాటు, నీటి నిల్వ కోసం బ్యారేజీల నిర్మాణం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయడం జరుగుతుందని రూపొందించిన డిపిఆర్ ను మూసి ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఈ.వి నర్సింహ్మరెడ్డి మంత్రులకు వివరించారు.

ఈస్ట్-టు-వెస్ట్ కారిడార్ లో భాగంగా నార్సింగి – గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం చేయనున్నామని, ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణపై డిపిఆర్ తయారీ దశలో ఉందని పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. మీర్ ఆలం ట్యాంకు పురోగతి పనులను వివరించారు. గాంధి సరోవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కావాల్సిన భూమిని రక్షణ శాఖ నుంచి బదలాయింపు చేసుకునే అంశంపై చర్చించారు. పర్యావరణానికి సంబంధించిన అన్ని అనుమతులను తీసుకొని ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అధికారులను అదేశించారు, మూసి ప్రాజెక్టు పునర్జీవనం వల్ల కలిగే ఉపయోగాల గురించి నగరంలో విస్ర్తతంగా ప్రచారం చేయాలని సూచించారు. బస్టాండ్లు, మెయిన్ రోడ్లు హోర్డింగ్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. సినిమా థియేటర్ లో కూడ వీడియోలను ప్రదర్శించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక, అనుమతులు, విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎక్కడా జాప్యం లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. రాజధాని అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించిందని వెల్లడించారు. అన్ని రకాల అనుమతులు, విధానపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాడానికి లక్ష్యంగా పెట్టుకొవాలన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలన్నారు.. దీనికి సంబంధించిన పూర్తి క్యాలెండర్ ను సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

టైంలైన్ నిర్దేశించుకొని స్పష్టమైన పురోగతి కనిపించే విధంగా పనుల నిర్మాణం జరుగాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎవరికి ఏలాంటి ఇబ్బంది కలుగకుండ నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించి ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో సాంకేతికపరమైన అంశాలలో ఐఐటి, జెఎన్ టియూ సంస్థల నుంచి తగిన సహాకారం తీసుకోవాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పని సరిగా పాటించే విధంగా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.

రబ్బర్ డ్యాం నమూనాల పరిశీలించిన మంత్రులు

మూసీ పునర్జీవం ప్రాజెక్టులో టూరిజం అభివృద్ధిలో భాగాంగ నదిలో పలు చోట్ల చెక్ డ్యాంల తరహాలో రబ్బర్ డ్యాంలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణాల వల్ల నీటి నిల్వను పెంచడం, జలక్రీడలు, మరియు బోటింగ్ సదుపాయాలకు ఉపయోగపడుతుంది. ఒబెర్ మేయర్ స్పిల్ వే గేట్ టెక్నాలజీ రూపొందించిన రబ్బర్ డ్యాం నమూనాను ప్రజా భవన్ లో మంత్రులు ఆసక్తిగా తిలకించారు. నాసిక్, ముంబాయి నగరాల్లో ఈ టెక్నాలజీ సంస్థ నిర్మాణం చేసిన రబ్బర్ డ్యాంలను పరిశీలించి తగిన అధ్యయనం చేసిన తరువాత నివేధిక ఇవ్వాలని అధికారులను మంత్రులు అదేశించారు. ఈ సమవేశంలో మెట్రో పాలిటన్ ఏరియా అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డిప్యూటి సీఎం సెక్రటరీ కృష్ణా భాస్కర్, వాటర్ బోర్డు ఎం.డి అశోక్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *