సీఎం రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

-విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతి.. ఘన నివాళులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారని, ఇది ప్ర‌భుత్వ‌ వైఫల్యాలు, నెరవేర్చని హామీల నుంచి ప్రజల, జెన్-జీ యువత దృష్టిని మళ్లించడానికేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతలు శాసనసభ్యుడికి అనుభవం అవసరమనే దూరదృష్టితోనే 25 ఏళ్ల వయస్సును నిర్ణయించారని, ఇప్పుడు సీఎం చేస్తున్నది మభ్యపెట్టే రాజకీయం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే ముందుగా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుండి మల్లికార్జున్ ఖర్గేని తప్పించి ఆ బాధ్యతలను ఏదేని యువ నాయకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. తమ పార్టీ ఇప్పటికే నితిన్ నబిన్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించి యువతకు తగిన ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.12వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల, బోధకుల కొరతతో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలకు రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక విద్యా వ్యవస్థ కుదేలైందని రామచందర్ రావు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డులు, విద్యార్థినులకు ఉచిత స్కూటర్లు, ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకు రిజర్వేషన్లు, యూత్ కమిషన్, ఎంప్లాయ్‌మెంట్ సపోర్ట్ సిస్టమ్ వంటి ప్రతి హామీ గాలిలో కలిసిపోయాయన్నారు. విద్యాశాఖను యువ నాయకుడికి అప్పగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదని, విద్యాశాఖలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా రామచందర్‌రావు ఘనంగా నివాళులర్పించారు. యువత, విద్యార్థుల అభ్యున్నతే కలాం జీవిత లక్ష్యమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టి సారించి విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.

శ్రీమన్ భగవద్గీత పుస్తకావిష్కరణ

ఈ సందర్భంగా జేఎన్‌టీయూలో జరిగిన పరిశోధన ఆధారంగా ప్రొఫెసర్ మల్లికార్జున్, సుజాత సంయుక్తంగా రచించిన శ్రీమన్ భగవద్గీత పుస్తకాన్ని రామచందర్ రావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులు, యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆత్మశాంతి, స్థితప్రజ్ఞత, ఏకాగ్రత, సత్వగుణం, శరణాగతి వంటి అంశాలను భగవద్గీత దృక్పథంలో సమగ్రంగా వివరించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి అందులోని మానవీయ విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *