– ఉచితాలు కావు.. ప్రజా పెట్టుబడులు
– ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లొద్దు
– పాలన అంటే పెత్తనం కాదు.. సమాజ హితం
– ‘పీపుల్స్ మార్చ్’ నుంచే ప్రజాహిత ఇందిరమ్మ పథకాలు
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మధిర, ప్రజాతంత్ర, జూలై 27 : ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఉచిత పథకాలపై విమర్శలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఇతర అనేక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టినట్లుగానే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరిపై ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని అన్నారు. ఈ పెట్టుబడి ఫలితాలు ప్రజలు అభివృద్ధి చెంది ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లేందుకు దోహదం చేసేవిగా ఉంటాయన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహార అల్పాహారాన్ని అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్ ను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ బిడ్డా కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం ఉదయమే రుచికరమైన, శుచి-శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకాన్ని మధిర నియోజకవర్గంలో ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉదయంపూట సంతృప్తికరంగా బ్రేక్ ఫాస్ట్ చేసి బిడ్డలు చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతో రుచికరమైన, శుచిశుభ్రతతో కూడిన న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలని తమ కేబినెట్ నిర్ణయం మేరకు బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. అర్ధాకలితో పాఠశాలకు వచ్చి అధ్యాపకులు చెప్పే పాఠాలను సరిగ్గా వినలేక, ఆకలితో సతమతమవుతూ చదువు మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఏ విద్యార్థికీ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సహజ వనరులు ఎంత అవసరమో సమర్థవంతమైన మానవ వనరులు కూడా అంతే అవసరమని భట్టి విక్రమార్క వక్కాణించారు. అత్యంత ప్రతిభావంతులుగా తయారైన మానవ వనరులు ఉన్న రాష్ట్రం గాని, దేశం గాని ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా మారుతుందని అన్నారు. వజ్రాల్ని తయారు చేసుకోవాల్సిన తరుణంలో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్నిరాష్ట్రవ్యాప్తంగా తలపెట్టే కార్యక్రమానికి నాంది పలికామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు ఒకటే సమయానికి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం.. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించాల్సిన అంశం అని చెప్పారు. ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున అల్పాహారం అందించే వ్యవస్థ లేదని భట్టి పేర్కొన్నారు. సంకల్పం మంచిదైతే భగవంతుని ఆశీస్సులు ఉంటాయని, అందుకే సాధ్యం కాదనుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం సాధ్యం చేసి చూపిందని డిప్యూటీ సీఎం తెలిపారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో పకడ్బందీగా, అత్యంత శుభ్రమైన వాతావరణంలో మెకనైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మధిరలోని తాత్కాలిక సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 16 మండలాల స్కూళ్లకు వాహనాల్లో అల్పాహారం అందిస్తున్నామన్నారు. రాబోయే మÖడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. పిల్లలకు అందించే అల్పాహారంతో పాటు పౌష్టికాహారం కోసం వారానికి మÖడు రోజులు పాలు, మరో మÖడు రోజులు రాగి జావను ప్రత్యేకంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. బడి పిల్లలతో కలిసి భోజనం చేయడం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత తృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. పాలన అంటే ఒక హోదా కాదు. అధికారం అంటే పెత్తనం చలాయించడం కాదు.. అధికారమన్నా, పాలనన్నా ఉన్న వనరుల్ని పోగేసి సమాజ హితం కోసం ప్రణాళికలు తయారు చేయడం.. వారి అభివృద్ధికి పునాదులు వేయడం అని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వారి కోసం రూ.5 లక్షలతో ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతున్నదన్నారు. గృహ ప్రవేశానికి మనం వెళ్లినప్పుడు ఆ పేదవాళ్ల కళ్లల్లో ఆనందం చూస్తే ఇది కదా పాలన అనే అనుభూతి కలుగుతోందన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్జారా చూశానని భట్టి చెప్పారు. ఆ సమయంలో బడుల దుస్థితి, నిరుద్యోగుల ఆవేదన, ఇల్లు లేని పేదల బాధలను విన్నానని చెప్పారు. ఆనాడే తన మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనలే నేడు ఒక్కొక్కటిగా పథకాలుగా మారుతున్నాయని భావోద్వేగానికి లోనవుతూ ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రజల జీవితాల్లో మార్పే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం 
విధానపరమైన నిర్ణయాలతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వాటి నిర్మాణానికి రూ.22,500 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభించడం తన రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన నిర్ణయమని అన్నారు. పభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బలహీనవర్గాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసాతో లక్షలాదిమంది రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్లు జమ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. మహిళలను మహాలక్ష్ములుగా గౌరవిస్తూ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వారికి ఆర్థిక భారం తగ్గించామని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఏడాదికి రూ.20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండున్నరేళ్లలో రూ.67,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించామని, ఐదేళ్లలో ఈ మొత్తం రూ.లక్ష కోట్లకుపైగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నాణ్యమైన సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో కోటి 6 లక్షల కుటుంబాలకు ప్రతి సభ్యునికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌరచంద్ర దాస ప్రభుజీ, ఫౌండేషన్ సీఈవో కౌంతేయ స్వామీజీ, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, కార్పొరేషన్ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం సైడ్‌లైట్స్
– విద్యార్థులకు అల్పాహారంతోపాటు అందించే మిల్క్ యూనిట్‌ను భట్టి విక్రమార్క ప్రారంభించారు.
~ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగాలని నృసింహ మహా యాగం చేయగా అందులో పాల్గొన్నారు.
– అల్పాహారం తయారు చేసే యంత్రాలను, కూరగాయ లాంజ్ శుద్ధి చేసే యంత్రాలను, ఇతర న్ని ఏర్పాట్లను పరిశీలించారు.
– విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఇడ్లి, పొంగల్, ఉప్మా, పూరీ, రాగి ఇడ్లి, ఇతర వంటకాలను రుచి చూశారు.
– విద్యార్థులకు వంటకాలను వడ్డించగా ఆయనతో మాట్లాడేందుకు, చేయి కలిపేందుకు విద్యార్థులు ఎంతో ఉత్సాహాన్ని చూపారు.
– వివిధ పాఠశాలలకు అల్పాహారాన్ని అందించే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
– సభ ప్రారంభంలో విద్యార్థులు రాష్ట్ర గీతాన్ని ఆలపించగా వాతావరణం ఉద్వేగంగా మారింది. చిన్నారులను అభినందించారు.
– సభలో పాల్గొన్న విద్యార్థులు మొత్తం భట్టి.. భట్టి అంటూ నినాదాలు చేయడం విశేషం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




