హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలందరూ ఆటపాటలతో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత అన్నారు. రాష్ట్ర ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. ప్రజల సాంస్కృతిక వైభవాన్ని, మహిళల ఐక్యతను చాటిచెప్పే ఈ పండుగలో ఎన్నో సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. బతుకమ్మ సంబురాలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ వేడుకలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
మంత్రి సీతక్క శుభాకాంక్షలు
తెలంగాణ ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అంటే మనకు పండుగ మాత్రమే కాదని, మన బతుకుల్లోని బంధాలను, ఆప్యాయతలను, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే గొప్ప సంస్కృతీ సంప్రదాయమని పేర్కొన్నారు. ప్రకృతిలో పూసే పూలను ప్రేమగా పేర్చి, బతుకమ్మను కొలుస్తూ ఆడిపాడే ఈ పండుగ తెలంగాణ ఆడబిడ్డల జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలు వినిపిస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుందని, కులమతాలకు, పేద ధనిక తేడాలకు అతీతంగా అందరూ ఒక్కచోట చేరి జరుపుకునే ఈ పండుగ మన ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి.. ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరియాలి.. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని సీతక్క పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువులు, ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




