స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

– పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు, హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యాసంస్థల దగ్గర ఉండే పాన్ షాపుల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, స్పెషల్ టీం, హెచ్ న్యూ మొత్తం 5000మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నట్లు వివరించారు. విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో ఉన్న 500కుపైగా పాన్ షాపుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించామన్నారు. విద్యాసంస్థలకు వంద మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదని, విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కొందరు పాన్ షాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని, తీరు మార్చుకోకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని అన్నారు. స్కూలు పరిసరాలు పొగాకు రహితంగా ఉండాలని సూచించారు. స్కూల్ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారని తమకు పలు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెంది తమకు ఫిర్యాదులు చేశారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. తమ సిబ్బంది డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారని, పొగాకు ఉత్పత్తులు స్కూల్ విద్యార్థులకు అమ్ముతున్నట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. కొన్ని రోజులుగా స్కూళ్ల వద్ద నిఘా పెట్టామని, ఈరోజు ఐదు వేలమంది పోలీసులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులను విద్యార్థులు తీసుకోవడం మొదలుపెడితే డ్రగ్స్ వైపు మళ్లే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. రాష్ట్రంలో నిషేధించిన పాన్ మసాలాలు, గుట్కాలు వంటివి ఎవరైనా అమ్ముతున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. కొన్ని పాన్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న వస్తువులను సీజ్ చేశారు. లోకల్ వస్తువులకు బ్రాండెడ్ ముద్ర వేసి అమ్ముతున్న కొన్నింటిని, అదేవిధంగా ఈ-సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్ హిల్స్‌లోని ఓ పాన్ షాపులో ఈ- సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *