డీలిమిటేషన్‌కు మహిళా బిల్లు ముసుగు

– దక్షిణాదిని దెబ్బతీసే కుట్ర విఫలం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంటులో దక్షిణ భారత దేశ ప్రాధాన్యాన్ని తగ్గిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఇప్పటికే 2023లో ఆమోదించిందని, ఆ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన పక్రియతో ముడిపెట్టాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా తాజా జనాభా గణనను ప్రాతిపదికగా తీసుకున్నా దక్షిణ భారత దేశం తీవ్రంగా నష్టపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ విషయం కేంద్రంలోని పాలకులకు కూడా బాగా తెలుసని చెప్పారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని తాజా బిల్లు పొందలేదని స్పష్టంగా తెలిసినప్పటికీ మోదీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. పార్లమెంటులో దక్షిణ భారత దేశ గళాన్ని అణచివేస్తున్న తీరుపై బీఆర్ఎస్ తరపున తాము తీవ్ర ఆందోళనను, నిరసనను వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది కాబట్టి ఈ దేశ మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న 543 స్థానాలతోనే అమలు చేయవచ్చన్నారు. పార్లమెంటులో దక్షిణ భారత దేశానికి ప్రస్తుతం 24 శాతం స్థానాలు ఉన్నాయంటూ ఆ స్థానాలు యధాతథంగా కొనసాగేలా చూడాలన్నారు. ఒకవేళ దక్షిణ భారత ప్రాధాన్యాన్ని 24 శాతం కంటే తగ్గిస్తే ఈ దేశ నిర్మాణంలో విశేష కృషిచేసిన దక్షిణ భారత ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు, ఆగ్రహం వ్యక్తమవుతాయని కేటీఆర్ హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *