ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21: డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంత్… ఏసు ప్రభువు జన్మించిన నెల.. శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన నెల… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల.. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే పండుగ క్రిస్మస్.. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే… పొరుగువారిని ప్రేమించాలని ఏసు ప్రభువు సందేశం అందించారు. విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వాలతో పోటీపడి క్రిస్టియన్స్ కూడా పేదలకు విద్య, వైద్య సేవలు అందించారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కంటే ఎక్కువ నాణ్యమైన సేవలు అందించి సమాజ నిర్మాణంలో వారు భాగస్వామ్యం అవుతున్నందుకు వారికి అభినందనలు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉంది. సర్వమతాలకు రక్షణ ఉండాలనే ఆలోచ మా ప్రభుత్వానిది. ఎవరూ మరో మతానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడే చర్యలను ప్రభుత్వం సహించదు..
ఎవరి విశ్వాసం వారు పాటించ వచ్చు… కానీ పరమత దూషణలు ప్రభుత్వం సహించదు.. 100 శాతం తెలంగాణలో మీకు రక్షణ ఉంటుంది.. పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దళిత, గిరిజన క్రిస్టియన్ సోదరులకు ఎంతో ఉపయోగపడుతుంది… సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ మొదలవుతుంది… ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో నిరుపేద దళితులు, దళిత క్రిస్టియన్స్ కు లబ్ది చేకూరేలా ప్రభుత్వం ఆలోచ చేస్తోంది.. ప్రభుత్వంలో మీకు సముచిత స్థానం కల్పిస్తాం. భవిష్యత్ లో పార్టీలోనూ సముచిత స్థానం కల్పించాలని పీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారి వివరాలు వారికి ఇస్తే సముచిత స్థానం కల్పిస్తారు. సంక్షేమ పథకాల్లో మీ కోటా, మీ వాటా మీకు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుంది. ఇది అన్ని మతాలను సమానంగా చూసే ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మీది…అన్నారు





