సింగరేణికి కేంద్ర ప్ర‌భుత్వ‌ సహకారం

– తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాం
– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: సింగరేణి ప్రాజెక్టుల కోసం ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్‌లను వేగవంతం చేయడంలో కేంద్రం సహకరిస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 137 ఏళ్ల చరిత్ర గల సింగరేణి సంస్థకు గత 12 ఏళ్లుగా కేంద్రం వివిధ రకాలుగా సహాయం అందిస్తోందన్నారు. సింగరేణిలో సుమారు 41,000 పర్మనెంట్, 31,000 కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, సుమారు 72,000 కుటుంబాలు ఈ సంస్థపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. సంస్థకు 39 వర్కింగ్ మైన్స్ ఉన్నాయని, 21 అండర్‌గ్రౌండ్, 18 ఓపెన్‌కాస్టు. సింగరేణి ఉత్పత్తి, ఆదాయాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ప‌రిష్క‌రించ‌డానికి యాజ‌మాన్యానికి సూచ‌ల‌ను చేశామ‌ని మంత్రి చెప్పారు. వాద-వివాదాల మధ్య తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపు గురించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ బ్లాక్‌కు సంబంధించి ఫైల్‌పై తాను ఈరోజే సంతకం చేశానని మంత్రి చెప్పారు. తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినట్లు ప్రకటించారు. ఈ బ్లాక్‌లో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఉన్నదని, వార్షికంగా సుమారు 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, 40-50 సంవత్సరాల పాటు మైనింగ్ కలిగి వుండగలదని చెప్పారు. తాడిచర్ల-2 ద్వారా సింగరేణికి సుమారు రూ.64,000 కోట్లు ఆదాయంగా రానుందని, వెంటనే ఆక్షన్ ప్రీమియం లేకపోవడం వల్ల సంస్థకు కనీసం రూ.2,550 కోట్లు మిగులుతాయని, అలాగే రాష్ట్రానికి రాయల్టీ, ఇతర మార్గాల్లో సుమారు రూ.16వేల కోట్లు లాభాలు ఉండొచ్చని మంత్రి చెప్పారు. దీనివల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సుమారు 1,200 అదనపు ఉద్యోగావకాశాలు కలుగుతాయని వెల్లడించారు. నైనీ బ్లాక్‌లో కూడా సుమారు 1,500 కొత్త ఉద్యోగాలు కల్పించగల అవకాశముందని చెప్పారు. సింగరేణి పురోగతికి, ఉత్పత్తి పెంచుకోవడానికి, ఖర్చు తగ్గించడానికి కేంద్రం అన్ని రకాల సహకారాలు అందిస్తుందని, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు, సింగరేణి కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *